Telangana Liqour Sales: రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ ఆదాయం క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ. 10 నుంచి 12 వేల కోట్లకు మించలేదు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం గుడుంబాను కట్టడి చేయడం సహా అక్రమ మద్యం విక్రయాలకు చెక్ పెట్టడంతో ఎక్సైజ్ శాఖ ఆదాయం అనూహ్యంగా పెరిగింది. మద్యం ధరలు పెంచడం కలిసొచ్చింది. ఫలితంగా ప్రతి ఏడాది ఎక్సైజ్ ఆదాయం పెరుగుతూనే ఉంది. వంద రూపాయల్లో 62 నుంచి 64శాతం వరకు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్‌ల ద్వారా ప్రభుత్వానికి చేరుతోంది. బార్లు, మద్యం దుకాణాలు, క్లబ్, పబ్‌లకు లైసెన్స్‌లు ఇవ్వడం ద్వారా ఖజానా నిండుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మద్యం అమ్మకాలపై రూ. 850.52 కోట్ల వ్యాట్ ఆదాయం రాగా... డిసెంబరులో ఏకంగా రెట్టింపు అయ్యింది. దాదాపు రూ. 1,535 కోట్ల వరకు వచ్చింది.
23వేల కోట్లకుపైగా...
రాష్ట్రంలో గతేడాది మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ. 26 వేల 400 కోట్లు సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు నాటికి కేవలం తొమ్మిది నెలల్లో రూ. 23 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో వ్యాట్ ద్వారా రూ. 10 వేల132 కోట్లు రాగా... మరో రూ. 10 వేల కోట్లు ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చిందని వివరించారు. మిగిలిన మొత్తం మద్యం దుకాణాల ఏర్పాటు కోసం దరఖాస్తులు విక్రయం, లైసెన్స్‌ల జారీ తదితర వాటి ద్వారా సమకూరింది. ఆబ్కారీ శాఖకు సగటున నెలకు అన్నిరకాలుగా రూ. రెండున్నర వేల కోట్లుకుపైగా ఆదాయం వస్తోంది.
30వేల కోట్లు...
డిసెంబర్‌లో మాదిరిగానే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అదేస్థాయిలో రాబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. రూ. 8 వేల కోట్లకు తగ్గకుండా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అనుకున్నట్లుగా జరిగితే... రాబడి రూ. 30 వేల కోట్లు ల్యాండ్ మార్క్‌ను దాటే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: