హైదరాబాద్ మహానగరానికి వరద ముప్పు పెరగడానికి కారణాలైన అనేక అంశాలపై నిపుణులు విశ్లేషించారు. మహానగరం లోపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలు ముప్పు పెరగడానికి కారణాలవుతున్నాయి. వేగంగా జరుగుతున్న నగరీకరణ, జనాభా పెరుగుదల, విస్తృతమైన నిర్మాణ రంగం, జలవనరులు కుంచించుకుపోతుండటం వంటివి ప్రధానంగా కనిపిస్తున్నాయి.
మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఆక్రమణలు... మూసీని నింపేస్తున్న ఘన వ్యర్థాలు... నాలాల ఆక్రమణలు ముంపునకు దారితీస్తున్నాయి. వర్షపు నీటి పరిమాణానికి, కాలువల సామర్థ్యానికి పొంతనలేని పరిస్థితులు, నిర్మాణ రంగంలో నిబంధనల ఉల్లంఘన, అటవీప్రాతం తగ్గడం, మైనింగ్ కార్యక్రమాలు పెరగడం వంటి అంశాలు హైదరాబాద్ వరదలకు మూలాలుగా పేర్కొంటున్నారు.
మురికి కూపంగా మూసీ..
హైదరాబాద్‌తో నగరానికి ఒకప్పుడు జీవనాడిగా ఉన్న మూసీనది నేడు మురికి నాలాగా మారింది. ఆక్రమణలతో మూసీ నది సహజ విస్తీర్ణం తగ్గిపోతోంది. దీనికి నీటిని తెచ్చే సహజమార్గాలన్నీ మూసుకుపోయాయి. నాలాలు అన్నీ మురుగునీటిని తెచ్చి నింపుతున్నాయి. భవన నిర్మాణ వ్యర్థాలు, ఘన వ్యర్థాల డంపింగ్‌యార్డుగా మూసీ మారడం తీవ్రమైన ప్రభావం చూపుతోంది. మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధిపేరిట చేపట్టిన ప్రాజెక్టులు నది సహజ ప్రవాహానికి అవరోధంగా మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా మూసీ ఎగువ ప్రాంతం కాంక్రీట్ జంగిల్‌గా మారింది.
నీటివనరులు ధ్వంసం
నగరంలో నిర్మాణాలు గణనీయంగా పెరిగాయి. ఇవి కూడా ఓ క్రమ పద్ధతిలో కాదు. పెరిగిన పట్టణీకరణ వల్ల నీటివనరులు ధ్వంసమయ్యాయి. నీటి వనరుల విస్తీర్ణం 2001లో 5949.28 హెక్టార్లు ఉంటే 2015 నాటికే 4764.73 హెక్టార్లకు తగ్గిపోయింది. అంటే ఏడాదికి 84.61 హెక్టార్ల నీటి నిల్వ ప్రాంతం తగ్గిపోయింది. వరద నీటి ప్రవాహాన్ని మళ్లించే కాలువలు, ఒక నీటి వనరు నుంచి ఇంకో నీటి వనరుకు వెళ్లే మార్గాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయి. ఈ పరిణామాల్లో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల పాత్ర ఉంది. అటవీప్రాంతం తగ్గిపోవడం ఎక్కువ వర్షం వచ్చినపుడు ప్రవాహాన్ని నిలువరించడంలో అటవీ ప్రాంతం చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా తగ్గిపోయింది.
2015లో పర్యావరణ పరిరక్షణ శిక్షణ సంస్థ (ఈపీటీఆర్‌ఐ) తెలంగాణ పర్యావరణ నివేదికను విడుదల చేసింది. ఇందులో అటవీ విస్తీర్ణం తగ్గిపోవడాన్ని ప్రస్తావించింది. హైదరాబాద్ చుట్టుపక్కల మైనింగ్ కూడా వరదలకు కారణమవుతోంది. డ్రైనేజీ వ్యవస్థలో మార్పులు నగరంలో 2011-2015తో పోలిస్తే డ్రైనేజి వ్యవస్థలో గణనీయమైన మార్పులు జరిగాయని హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ విభాగానికి చెందిన అభిలాష్, సచిన్‌లు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. మెగా ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణ కూడా వరదల వల్ల ఎక్కువ నష్టానికి కారణమైందనే అభిప్రాయాన్ని కొందరు పరిశోధకులు వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణలు కూల్చి..
వరదల ప్రభావానికి గురైన మల్కాజిగిరి, అల్వాల్, అశోక్‌నగర్‌లాంటి ప్రాంతాల్లో 1200 కిలోమీటర్ల పొడవైన వాననీటి కాలువలు (స్టారమ్ వాటర్ డ్రైన్) గంటకు రెండు సెంటీమీటర్ల వాననీటిని మాత్రం ప్రవహించే సామర్థ్యంతో ఉన్నాయి. ఆక్రమణలను కూల్చివేసి నాలాలను విస్తరించాలని కిర్లోస్కర్ నివేదిక కూడా సూచించింది.చుట్టుపక్కల వ్యవసాయ భూములు తగ్గడం... భారీ వర్షాలు వచ్చినపుడు వ్యవసాయ భూములు స్పాంజ్ లాగా పనికొచ్చేవి. కొంత నీరు ఈ భూముల్లో ఇంకేది. కానీ పట్టణీకరణ వల్ల ఇలాంటి వ్యవసాయ భూమి గణనీయంగా తగ్గింది.
హైదరాబాద్‌ను ఆనుకొని ఉండే మెదక్ జిల్లాలో 66,055 హెక్టార్ల భూమిని వ్యవసాయేతర అవసరాలకు మళ్లించగా, ఇందులో సగం స్థిరాస్తి వ్యాపారంలోకి వెళ్లిందని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన వికాస్ శెహ్రా మూసీపైన, హైదరాబాద్ పట్టణీకరణపైన చేసిన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో భారీగా వ్యవసాయ భూములు వ్యవసాయేతర వినియోగానికి మారాయి. సెజ్‌లు, ఐటీ పార్కులు మొదలైనవి వచ్చాయి.
వరద ముప్పు పెరగడానికి గల కారణాలను కొహెన్ బెంజమిన్ అనే మరో పరిశోధకుడు కూడా విశ్లేషించారు. సమష్టి లక్ష్యాలతోనే సత్ఫలితాలు మహానగరంలో వరదముప్పు తగ్గించడానికి ఏంచేయాలో కూడా నిపుణులు తమ అధ్యయనాల్లో సూచించారు. వాటి ప్రకారం మురుగునీటికి, వాననీటికి డ్రైన్లు విడివిడిగా ఉండాలి. వాననీటి కాలువల వ్యవస్థను పటిష్ఠం చేయాలి. మాస్టర్ ప్లాన్‌లో సామాజిక పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పట్టణ నీటివనరులను పునరుద్ధరించాలి. పచ్చదనం పెంపొందించాలి. బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఖాళీ స్థలాలను నిర్వహించాలి. వాననీరు భూమిలో ఇంకేలా భవన నిర్మాణ నిర్మించేలా చూడాలి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల మధ్య సమన్వయం అవసరం.