ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లల్లో రాష్ట్రానికి అరుదైన ఘనత సొంతమైంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికి పెద్దపీట వేసిన కేసీఆర్ సర్కార్... ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం సాగు నీటి ప్రాజెక్టు, ఇతర వనరులు అందుబాటులోకి తీసుకోవడం... ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాల అమలు రైతన్నకు వెన్నుదన్నైంది. రైతు సంక్షేమ చర్యల నేపథ్యంలో ఏటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా 2020-21 యాసంగి సీజన్‌లో మద్దతు ధరతో రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ రికార్డు స్థాయిలో సేకరించింది.
సవాళ్లు అధిగమించి...
ఇందిరా క్రాంతి పథం కొనుగోలు కేంద్రాల ద్వారా 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఆల్ టైం రికార్డు అని పౌరసరఫరాల సంస్థ అధికారికంగా వెల్లడించింది. ధాన్యం సేకరణ ప్రక్రియలో పలు ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనప్పటికీ... మొత్తం మీద రెండు రోజుల కిందట అన్ని కొనుగోలు కేంద్రాలు మూసివేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో రూ.84 వేల కోట్లు విలువ చేసే 4కోట్ల 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 2019-20 వరకు ధాన్యం కొనుగోలు చేసిన ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌లతోపాటు జీసీసీ, హాకా వంటి ఏజెన్సీలకు 1029 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించింది.
'ఇదివరకు యాసంగిలో కంటే వానా కాలంలో ఎక్కువ పంటలు పండేవి. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా వానా కాలంలో పండిన పంట కంటే యాసంగిలో అధిక దిగుబడులు వస్తున్నాయి. ముగిసిన యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లే అందుకు నిదర్శనం.'
-మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్
ఆల్‌టైం రికార్డు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ఏడాది 2014-15 యాసంగిలో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఏటా పెరుగుతూ 2021 యాసంగిలో 92 లక్షల మెట్రిక్ టన్నులకు చేరడం... అంటే 594 శాతం కొనుగోళ్లు పెరిగాయి. ఇది యావత్తు తెలంగాణ రైతుల విజయంగా ఆ సంస్థ వర్గాలు అభివర్ణించాయి. యాసంగికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించిన ఆ సంస్థ... రెండున్నర నెలలపాటు ప్రక్రియ నిర్విరామంగా సాగించింది. రికార్డు స్థాయిలో 15 లక్షల మంది రైతుల నుంచి రూ.17,300 కోట్ల విలువైన 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. గతేడాది యాసంగితో పోల్చుకుంటే ఈ సారి 28 లక్షల మెట్రిక్ టన్నులు అధికం. మొదట 80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా అదనంగా 12 లక్షలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది.
'ధాన్యం రవాణా, గన్నీ సంచులు, సోసైటీ కమిషన్‌కు అదనంగా దాదాపుగా రూ.2 వేల కోట్ల వ్యయమైంది. 23 జిల్లాల్లో ముందస్తు అంచనాలకు మించి 100 నుంచి 225 శాతం వరకు కొనుగోళ్లు పెరిగాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 125 శాతం, నారాయణపేట - 95 శాతం, రంగారెడ్డి - 83 శాతం, నిర్మల్ - 44 శాతం, వరంగల్ గ్రామీణ - 64శాతం, సంగారెడ్డి - 32శాతం, భూపాలపల్లి - 33శాతం, వికారాబాద్ జిల్లాలో 44 శాతం కొనుగోళ్లు పెరిగాయి.'
-మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాకు రేషన్ బియ్యం పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యేవి. ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు సరిపోగా... ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. గతేడాది భారత ఆహార సంస్థ... దేశవ్యాప్తంగా సేకరించిన బియ్యంలో తెలంగాణ వాటా 55 శాతం ఉండటం రాష్ట్రానికి గర్వకారణం.
ఇదీ చదవండి: భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు సబ్ కమిటీ ఆమోదం