Rajnath Singh Telangana Tour today : అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు దీటుగా బీజేపీ నాయకులు ప్రచార రంగంలోకి దిగారు. బీజేపీ నిర్వహించే సభలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో హుజూరాబాద్ చేరుకుని.. రోడ్డు మార్గం ద్వారా జమ్మికుంటకు వెళ్తారు. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మహేశ్వరానికి వెళ్లి.. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత రాత్రి 7.35 గంటలకు దిల్లీకి పయనమవుతారు.
Kishan Reddy Fires on CM KCR : అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తూనే..ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈసారి ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి బీజేపీను గెలిపించుకోవాలని కోరారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిచినా.. కారు స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలోనే ఉంటుందని కిషన్‌రెడ్డి విమర్శించారు. విజ్ఞతతో ఓటు వేసి ప్రజల వికాసం తెచ్చే బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
''కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్‌ల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు. కిరాయిలు కట్టుకోలేక మురికి వాడల్లో, చిన్న చిన్న రూముల్లో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు ఇళ్లు కట్టాలనే మనసు కేసీఆర్‌కు లేదు. ఈసారి ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి బీజేపీను గెలిపించుకోవాలి. బీఆర్ఎస్ మళ్లీ గెలిచినా..కారు స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలోనే ఉంటుంది. ''-కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
BJP Election Campaign Telangana 2023 : ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధి బూతు అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇంచార్జ్‌లతో విస్తృత స్థాయి సమావేశం అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా బెంగళూరు ఎమ్మెల్యే మునిరత్నం హాజరయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు.ఎల్బీనగర్‌లో కార్పొరేటర్ల పట్టుతో వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలని దిశానిర్దేశం చేశారు.
సీఎం కేసీఆర్ హయాంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని.. వచ్చిన కొన్ని కూడా లీకులు, వాయిదాలు పడుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. సూట్ కేసులకు అమ్ముడుపోయే పార్టీ బీజేపీ కాదన్న ఆయన.. బీజేపీ పార్టీ సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తుందని వివరించారు. పార్టీ మారుతున్న అనే ప్రచారాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆదిలాబాద్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఖండించారు. కాంగ్రెస్ వాళ్లు చేసే ఆ ప్రచారాన్ని నమ్మొద్దని బీజేపీ శ్రేణులను కోరారు.