Rain Lashes In across Telangana: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వడగండ్ల వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్,.. తంగళ్ళపల్లి ,బోయిన్‌పల్లి, గంగాధర, భీమారం, రామడుగు, మానకొండూరు, చొప్పదండి మండలాల్లో వడగండ్ల వాన దంచి కొట్టింది.
పెద్దపల్లి జిల్లాలోను పలుచోట్ల వర్షం పడింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందకుంట, కమలాపూర్ భారీ వర్షం కురిసింది. వీణవంకలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కురు, ఆత్మకూరు, గుండాల మండలాలలో వడగండ్ల వాన బీభత్సంతో పంటలు దెబ్బతిన్నాయి. చేతికందొచ్చిన వరిపంట నేల వాలాయి. ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో మామిడికాయలు రాలిపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
పలు జిల్లాలో వడగండ్ల వాన: కామారెడ్డి జిల్లా మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడంగల్ మండలాల్లో బలమైన ఈదురు గాలులతో వడగండ్లు కురిశాయి. సుమారుగా గంట పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం చక్రంపల్లిలో వడగండ్ల వాన కురిసింది. డిచ్పల్లి మండల పరిధిలోని ఉల్లి పంట దెబ్బతింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో.. జనగామ జిల్లా పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో వడగండ్ల వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లా రేగొండ, చిట్యాల,టేకుమట్ల, మొగుల్లపల్లి మండలాల్లో.. నిర్మల్ జిల్లా భైంసా, కుబీర్, కుంటాల, ముథోల్, తానూర్ మండలాల్లో భారీ వర్షం పడింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనూ వర్షానికి రోడ్లపై నీళ్లు ప్రవహించాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన యారం లక్ష్మిరెడ్డి చెందిన బొప్పాయి పంట దెబ్బతింది. ఆయన 30 ఎకరాల్లో మన్సింగ్ పద్ధతిలో బొప్పాయి సాగు చేస్తుండంగా.. అకాల వర్ష కారణంగా సుమారు పదెకరాల్లోని చెట్లు నేలకొరిగాయి. దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. మరోవైపు కల్లాలో ఆరబెట్టిన మిరపకాయలు తడిచిపోవడంతో.. అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
జంట నగరాల్లో పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం: హైదరాబాద్‌లో వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. జంట నగరాల్లో ఈరోజు పలుచోట్ల కురిసిన వర్షానికి నగరవాసులు తడిసి ముద్దయ్యారు. ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై పలుచోట్ల వడగండ్లు కురిశాయి. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యారడైజ్ ,మాదాపూర్, హైటెక్ సిటీ, కుత్బుల్లాపూర్, కేపీహెచ్‌బీ, దుండిగల్ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. జీడిమెట్ల, సూరారం, జగద్గిరిగుట్ట, గండి మైసమ్మ, మియాపూర్, చందానగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం దంచి కొట్టింది.
రహదారుల పైకి వచ్చి చేరిన వరద నీరు: బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బేగంపేట్, ప్యాట్నీ, తిరుమలగిరి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. కాప్రా, ఈసీఐఎల్, చార్మినార్, బహదూర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్నామ, బోడుప్పల్, ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఆల్విన్ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట్‌లో చిరుజల్లులు కురిశాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రహదారుల పైకి వచ్చి చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
నగరంలో కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు లక్డీకపూల్ నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌కి వెళ్లే మార్గంలో భారీ వృక్షం నెలకొరిగింది. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం ప్రహరీ గోడ కోసం గుంత తీస్తుండగా... చెట్టుకు సపోర్ట్ లేకపోవడంతో ఒక్కసారిగా రోడ్డుపై కూలిపోయింది. దీంతో అక్కడే నిలిపిన ఉన్న రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమయానికి అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఇవీ చదవండి: అకాల వర్షం.. రైతన్నలకు తీరని నష్టం..
నేను అన్నది తెలంగాణలో మాట్లాడే సాధారణ భాషే: బండి సంజయ్
8 జిల్లాల పోలీసుల ప్లాన్.. 100 కార్లతో ఛేజ్.. అసలెవరీ అమృత్‌పాల్?