లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేయడంతో... రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వలస కూలీలు రెండురోజులుగా ఇంటిబాట పట్టారు. కూలీలు, కార్మికులు భారీగా స్వస్థలాలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారికి అవగాహన కల్పించి ప్రస్తుతం ఉంటున్న ప్రాంతాలకే పంపారు.
స్వచ్ఛంద సంస్థల సహకారంతో..
రాచకొండకమిషనరేట్ పరిధిలో సుమారు 28వేల మంది వలసకూలీలు ఉన్నారన్న అధికారులు.. ప్రస్తుతం వారికి ఉపాధి లేకపోవడంతో స్వచ్ఛంద సంస్థల సహకారంతో భోజనంతోపాటు నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు సహా పలువురు వ్యక్తిగతంగా ముందుకొచ్చి తమ వంతుగా సాయం చేస్తున్నారు. రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్‌లో 9490617234 ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశారు. వాటికి వచ్చిన ఫోన్ల ఆధారంగా ప్రతిరోజు 1800 మందికి ఆహారంతో పాటు నిత్యావసరాలు అందిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయలు, 12కిలోల బియ్యం బాధితులకే అందేలా చూస్తున్నారు.
వలసకూలీల అవసరాలపై అధ్యయనం
వలసకూలీలు, కార్మికులకు అన్ని ఏర్పాట్లుచేస్తున్నా స్వస్థలాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతుండటంపై కారణాలు తెలుసుకోవాలని రాచకొండ పోలీసులు నిర్ణయించారు. వారి సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌తో కలిసి వలసకూలీల సామాజిక, ఆర్థిక, ఇతర అవసరాలపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు. ఈ మేరకు జవహార్‌నగర్ ఠాణా పరిధిలోని శాంతినగర్‌లో 150మంది వలస కార్మికుల్ని కలిసి వారిబాగోగులు అడిగి తెలుసుకున్నారు.
లాక్‌డౌన్ వల్ల వలస కూలీల్లో కాస్త మానసిక ఆందోళన నెలకొన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈఅధ్యయనంతో భవిష్యత్తులో వారికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడం సులభమవుతుందని పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్