Rachakonda CP DS Chauhan review meeting in HYD: ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులకు పండగ వచ్చినట్టే. ప్రతి మ్యాచ్‌ను చూసేందుకు వేలల్లో ప్రజలు వస్తారు. దీంతో స్టేడియం అభిమానులతో నిండిపోయి ఉంటే.. స్టేడియం వెలుపల వాహనాలతో నిండిపోతుంది. అక్కడ పరుగులతో ప్రజలు గోల చేస్తూ ఉంటే.. ఇక్కడ వాహనాల హారన్‌తో మోత మోగిపోతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు. దీనితో పాటు బ్లాక్‌లో టికెట్లు అమ్మే వ్యక్తులు ఎక్కువ అవుతారు. ఇలాంటి ఏవీ జరగకుండా ఉండేందుకు అధికారులకు రాచకొండ సీపీ చౌహాన్ భద్రతా సూచనలు ఇచ్చేందుకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
భద్రతా ఏర్పాట్లపై జాగ్రత్త వహించండి: ఈ నెల 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుండగా.. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం 7 మ్యాచ్ లు జరగనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ వేదికగా పలు జట్లతో 7 మ్యాచ్‌లు ఆడనుంది. ఏప్రిల్ రెండో తేదిన రాజస్థాన్ రాయల్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ జట్టు ప్రతినిధులు, బీసీసీఐ, హెచ్‌సీఏ ప్రతినిధులు, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి.. పలు సూచనలు చేశారు. మ్యాచ్‌లు జరిగే సమయాల్లో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లపై జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి: రాచకొండ పరిధిలో జరిగే అన్ని మ్యాచ్‌లకు కట్టుదిట్టమై భద్రత ఇవ్వడం తమ బాధ్యతని చెప్పారు. తమ పని తీరు మరింత మెరుగు పరుచుకోవడానికి ఇదొక మంచి అవకాశమని ఆయన భద్రతా సిబ్బందికి సూచించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని సీపీ పేర్కొన్నారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని ఇందుకు సన్ రైజర్స్ యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
స్టేడియం చుట్టూ అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పార్కింగ్ కోసం గతంలో చేసినట్లే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బ్లాక్‌లో టికెట్లు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చిరించారు. మ్యాచ్ టికెట్ల పంపిణీ అంతా.. పూర్తి పారదర్శకంగా జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రేక్షకులకు తెలిపారు.
ఇవీ చదవండి: