జనాభాలో కులగణన వెంటనే చేయాలని ఈ అంశంపై జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R Krishnaiah Bc Census) తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జాతీయస్థాయిలో ఉద్యమం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నిర్ణయించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జనాభా గణన చేయడానికి ఎందుకు వ్యతిరేకంగా ఉందో అసలు బీసీల అభివృద్ధి భాజపా ప్రభుత్వానికి గిట్టదా అని ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు.
ఈనెల 8 నుంచి 15 వరకు రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంట్ లోక్సభ, రాజ్యసభ సభ్యులను కలిసి ఒత్తిడి తెస్తామన్నారు. జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు చెందిన బీసీ నాయకులు.. పార్లమెంట్ సభ్యులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు వివరించారు. జాతీయ స్థాయిలో ముఖ్య నాయకులను ఎన్సీపీ నేత శరద్ పవార్(Sharad pawar), సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav), ఆర్జేడీ అధ్యక్షుడు శరద్ యాదవ్ (Sharad Yadav), బీఎస్పీ అధినేత మాయావతి(Manavati), డీఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్(Stalin)ను కలిసి సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.
త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr), ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy), కేరళ సీఎం పినరయి విజయన్(Pinaraie Vijayan)ను కూడా కలిసి ఆయా రాష్ట్రాల్లో ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని కోరనున్నట్లు భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు.
గతంలో కులాల వారి లెక్క తీయాలని సుప్రీంకోర్టులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర బీసీ ఫ్రంట్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులు వేసింది. ఈ కేసులో సమాధానంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారి లెక్కలు సాధ్యం కాదని పిటీషన్ దాఖలు చేసింది. గతంలో 2010, 2018లో రెండు సార్లు కులగణాలకు అంగీకరించిన భాజపా ఇప్పుడు వ్యతిరేకించడంలో ఉన్న హేతుబద్ధత ఏంటీ? ఎంపీలకు జనాభా గణనలో కులగణన తీయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా ఈ ఉద్యమాన్ని జాతీయస్థాయిలో ఉద్ధృతం చేయాలని కాబట్టి... దిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరులో జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించాలని నిర్ణయించాం.
-- ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
ఈ సమావేశంలో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, జాతీయ కార్యదర్శి గుజ్జ సత్యం, నీల వెంకటేశ్, కోలా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: cm kcr speech in assembly: 'మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తాం'