తాను వ్యవసాయ విశ్వవిద్యాలయం అవిభక్త విద్యార్థినని నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ గోవిందరాజులు చింతల అన్నారు. వ్యవసాయ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోయంలో జరిగిన వర్సిటీ 4వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్‌భవన్ నుంచి ఆన్‌లైన్ వేదికగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొన్నారు.
కరోనా అంధకారంలో వెలుగు రేఖ..
కొవిడ్-19 నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని... ఈ సమయంలో వ్యవసాయం ఓ వెలుగు రేఖ అని గోవిందరాజులు అన్నారు. వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన 3 ఆర్డినెన్స్‌లు వ్యవసాయ రంగాన్ని, రైతులను మరింత బలోపేతం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యాన, పశుపోషణ రంగాలకు ప్రభుత్వం మంచి ప్రోత్సాహం ఇస్తోందని కొనియాడారు. రైతాంగం ప్రయోజనాల దృష్ట్యా... తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక రైతుబంధు పథకం ఒక ట్రెండ్ సెట్టర్ అని కితాబిచ్చారు.
శుభపరిణామం
విద్యార్థుల ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ స్నాతకోత్సవం ఆన్‌లైన్‌లో నిర్వహించడం శుభపరిణామం అని గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. ప్రపంచం అంతా లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ... వ్యవసాయ రంగం నిరంతరం పనిచేసిందని... రైతులు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరించి వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని ప్రశంసించారు.
వారి ప్రోత్సాహంతోనే తొలిస్థానం
ఐసీఏఆర్, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు ఎల్లవేళలా అందిస్తున్న సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం దక్షిణ భారతంలో మొదటి స్థానంలో ఉందని వర్సిటీ ఉపకులపతి ప్రవీణ్‌రావు అన్నారు.
అనంతరం... నాబార్డ్ ఛైర్మన్ గోవిందరాజులుకు విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ పురస్కారం ప్రదానం చేశారు. పట్టభద్రులకు డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ పట్టాలు గోవిందరాజులు, ప్రవీణ్‌రావు చేతుల మీదుగా అంజేశారు. అండర్ గ్రాడ్యుయేట్ మేడిశెట్టి అనూహ్యకు పీజేటీఎస్ఏయూ అవుట్‌స్టాండింగ్ స్టూడెంట్ గోల్డ్ మెడల్ అందజేశారు.
ఇదీ చూడండి: బాలీవుడ్‌కు 'డ్రగ్స్' మరక.. గుట్టు బయటపెడతానన్న కంగన