మ్యుటేషన్ల ప్రక్రియను జీహెచ్‌ఎంసీ అటకెక్కిస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం వస్తుందంటూ కొందరు అధికారులు దరఖాస్తులు తీసుకోవడం ఆపేస్తున్నారు. కొన్ని రోజులయ్యాక సబ్‌రిజిస్ట్రారు కార్యాలయంలో మ్యుటేషన్ చేసుకోవచ్చని యజమానులకు సూచిస్తున్నారు.
ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చే వరకు తామే మ్యుటేషన్ చేస్తామని మరికొందరు చెబుతున్నారు. ఎవరు చెప్పేది నమ్మాలో తెలియక దరఖాస్తుదారులు తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో బల్దియా రెవెన్యూ విభాగం కొత్త చట్టంతో తమ అధికారాలకు ఏమేర కోత పడుతుందోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కార్పొరేషన్లు, పురపాలక సంస్థల పరిధిలో ఆస్తుల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆస్తిపన్ను నిర్ధరణ అధికారులను ప్రభుత్వం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి అప్పగించిందని, వాటితో ముడిపడిన ఆస్తిపన్ను వసూలు, పన్ను మదింపు తనిఖీలు, వ్యక్తిగత ఇళ్లపై వచ్చే అదనపు అంతస్తులకు పన్ను నిర్ధరణ, ఇతరత్రా అంశాలపై స్పష్టత కొరవడిందని గుర్తుచేస్తున్నారు.
బల్దియా అధికారాలకు కోత!
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం మ్యుటేషన్ ప్రక్రియ జరుగుతోంది. వ్యక్తిగత ఇళ్లు, భవన సముదాయాల్లోని ప్లాట్లు, ఖాళీ స్థలాలను కొనుగోలు చేశాక.. కొత్త యజమానులు ఆ ఆస్తిని సంబంధిత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ పేరుతో రిజిస్ట్రేషన్, అనంతరం బల్దియాలో మ్యుటేషన్ చేయించుకుంటారు. అంటే యజమాని పేరులో మార్పు చేసుకోవడం. బల్దియా రెవెన్యూ విభాగం అధికారులు.. సదరు వ్యక్తి దరఖాస్తుతోపాటు సమర్పించే ఆస్తి సేల్ డీడ్, లింకు డాక్యుమెంట్లు, ఇతరత్రా పత్రాలను పరిశీలించి యజమాని పేరు మార్చుతారు. కానీ 2016 తర్వాత కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తులకైతే బల్దియానే నేరుగా ఆస్తిపన్ను యాజమాన్య హక్కును బదిలీ చేయాల్సి ఉంటుంది. అప్పట్నుంచి ఆస్తిపన్ను కొత్త యజమాని పేరుతో వస్తుంది.
2016కు ముందు పాత పద్దతిలో అయితే చాలా అవకతవకలు జరిగేవి. వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బల్దియా అధికారాలకు కోత పెట్టిందన్న వాదన వినిపిస్తోంది. నయా చట్టం అమల్లోకి వస్తే అప్పట్నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆస్తిపన్ను నిర్ధరణ సబ్‌రిజిస్ట్రార్ వద్ద జరిగిపోతుంది. అందుకు సంబంధించిన దస్త్రాలను రిజిస్ట్రార్లకు అప్పగించేందుకు బల్దియా సిద్ధంగా ఉంది. అయినప్పటికీ ఇతరత్రా సమస్యలు తలెత్తుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
స్పష్టత రావాల్సిన అంశాలు..
- సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉండరు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని అనుకుంటే.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌తోపాటు ఆస్తిపన్ను మదింపు ఒకేసారి జరిగిపోతుంది. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో సదరు నిర్మాణాన్ని నివాస కేటగిరీలో చూపించి, తర్వాత వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తే పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అప్పుడు తనిఖీ చేసి పన్ను విలువ పెంచడం ఎవరి పరిధిలో ఉంటుంది?
- ఓ యజమాని ప్రస్తుతం ఉన్న ఇంటిపై అనుమతితో మరో రెండు అంతస్తులు కట్టుకుంటాడు. వాటిని ఇతరులకు విక్రయించాల్సిన అవసరం లేదనుకుంటే.. అతను ఆ అంతస్తులను రిజిస్ట్రేషన్ చేయించడు. అప్పుడు వాటికి పన్ను నిర్ధరణ జరగదని, దానిపై ఎవరు స్పందించాలని అధికారులు అడుగుతున్నారు.
- ఆస్తిపన్నును నిర్ధరించే రిజిస్ట్రేషన్ అధికారులు, ఆస్తిపన్ను వసూలు ప్రక్రియనూ పర్యవేక్షిస్తే బల్దియా ఆధ్వర్యంలో పనిచేస్తోన్న బిల్‌కలెక్టర్లు, ఇతర సిబ్బందికి ఏయే విధులు కేటాయిస్తారు?
- ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన ఆస్తులు, ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులపై జీహెచ్‌ఎంసీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి?
ఇదీ చదవండిః గ్రేటర్‌లో అభివృద్ధి మంత్రంతో ఎన్నికలకు వ్యూహం!