కరోనా పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన పని లేదు. లక్షణాలు లేని వారిలో వైరస్ ప్రభావం అంతంత మాత్రమే అని వైద్యులు చెబుతూనే ఉన్నా.. బాధితులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ కాగానే ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రస్తుతం పడకలు నిండుకున్న పరిస్థితి ఏర్పడింది.
హోం ఐసోలేషన్ ప్యాకేజీ..
ఈ నేపథ్యంలో అనేక ప్రైవేటు ఆసుపత్రులు హోం ఐసోలేషన్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాయి. లక్షణాలు లేని వారు, స్వల్పంగా లక్షణాలు ఉన్నవారికి అతి తక్కువ ఖర్చుతో చికిత్స అందించేందుకు ముందుకు వచ్చాయి. రోగికి కావాల్సిన అన్ని రకాల మందులు, ఆన్లైన్ కన్సల్టేషన్లతో పాటు.. అత్యవసరమైతే తక్షణమే ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఫలితంగా పరిస్థితి చేయి దాటితే పడకలు దొరకవన్న భయం బాధితుల్లో లేకుండా పోయింది. ఇక అవసరాన్ని బట్టి ఈ ప్యాకేజీలో బేసిక్, అడ్వాన్స్డ్, స్టాండర్డ్ ప్యాకేజీలు ఉన్నాయి.
రోజుకు రూ.600 నుంచి 2000..
నగరంలోని కేర్, సన్‌షైన్, కిమ్స్, ఆస్టర్ ప్రైమ్ వంటి పలు ఆసుపత్రులు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వైరస్‌తో బాధపడుతున్న వారు ఆయా ఆసుపత్రుల వెబ్సైట్లో నమోదు చేసుకోవడం లేక నేరుగా ఆసుపత్రికి ఫోన్ చేసి ఈ ప్యాకేజీలను పొందవచ్చు. ఒక్కో ఆసుపత్రి సుమారుగా రోజుకు రూ.600 నుంచి రూ.2000 వరకు ఫీజులు తీసుకుంటుంది. అంటే 14 రోజుల ప్యాకేజీకి అయ్యే ఖర్చు రూ.10 నుంచి 25 వేల వరకు మాత్రమే ఉంటుంది.
నిరంతరం పర్యవేక్షణ..
ఈ ప్యాకేజీలో భాగంగా నిపుణులైన వైద్యులు రోజుకు రెండుసార్లు బాధితుల ఆరోగ్యాన్ని ఆన్లైన్ ద్వారా పర్యవేక్షిస్తారు. అవసరమైన మందులు, పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్ వంటి కిట్లను ఇంటికే పంపటంతో పాటు వాటి వినియోగాన్ని వివరిస్తారు. కౌన్సెలింగ్‌ల ద్వారా కరోనాపై ఆందోళన పడేవారిలో మానస్థిక స్థైర్యాన్ని పెంపొందించటంతో పాటు రోగి ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్న అనుమానం వస్తే వెంటనే ఇంటికే అంబులెన్స్ పంపి ఆసుపత్రికి తరలిస్తారు. ఫలితంగా ఎలాంటి సమయంలోనైనా అవసరమైన వైద్య సహాయం అందించే సౌకర్యం ఏర్పడుతోంది. ఈ ప్యాకేజీ కొవిడ్ బాధితులకు ఎంతో ఉపశమనం కలిగిస్తోంది.
ఇదీ చూడండి: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్: సీఎం కేసీఆర్