PM Modi Telangana Tour: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడంతో పాటు పలు రైల్వే, జాతీయ రహాదారులు శంకుస్థాపన కోసం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, మురళీధర్‌రావు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అనంతంరం భాజపా ఆధ్వర్యంలో విమానాశ్రయం బయట ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మోదీ పాల్గొన్నారు.
నేరుగా తెరాస, కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ పేరుతో పార్టీ పెట్టిన వారు పదవులు అనుభవిస్తూ.. ప్రజల్ని మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. భాజపా శ్రేణుల పోరాటంతో మునుగోడు ఉపఎన్నిక కోసం రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కదిలి వచ్చిందని తెలిపారు. దీంతో తెలంగాణలో కమలం వికాసం స్పష్టంగా కనిపిస్తోందని మోదీ స్పష్టంచేశారు.
"తెలంగాణ పేరు చెప్పుకొని ఎవరైతే పదవులు పొంది పెద్దవారయ్యోరో, అధికారంలోకి వచ్చి అభివృద్ధి చెందారో, వారే తెలంగాణను వెనక్కి నెట్టారు. ఏ పార్టీపై తెలంగాణ ప్రజలు అత్యంత విశ్వాసం ఉంచారో, వారే విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. ఏ ఉపఎన్నిక జరిగినా ఒకే సందేశం వస్తోంది అదే తెలంగాణలో సూర్యోదయం ఎంతో దూరం లేదని. తెలంగాణలో అంధకారం తొలగిపోయి కమలం వికాసం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణను అవినీతి, కుటుంబ కబంధ హస్తల నుంచి విముక్తి కల్పించడం మన కర్తవ్యం. తెలంగాణలోనూ అవినీతి రహిత, సుపరిపాలన అందించేందుకు భాజపా సిద్ధంగా ఉంది. తెలంగాణ, హైదరాబాద్ నాకు ఎంతో కీలకమైంది. ఎప్పటికీ ఇక్కడి ప్రేమను మర్చిపోలేను. నేను దీనికి అదనంగా అభివృద్ధి రూపంలో చెల్లిస్తూనే ఉంటాను." -నరేంద్ర మోదీ, ప్రధాని
ఐటీ హబ్‌గా కేంద్రంగా ఉన్న తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అంధ విశ్వాసాలను ప్రోత్సహిస్తోందని ప్రధాని ఆరోపించారు. సీఎం నివాసం నుంచి మంత్రి మండలి ఎన్నిక వరకు మూఢ విశ్వాసాలనే నమ్ముకున్నారని తెలిపారు. దిల్లీ ఎర్రకోట సాక్షిగా తాను చేసిన ప్రకటన మేరకు.. తెలంగాణలోఅవినీతిని పెకిలించి వేస్తానని ప్రకటించారు.
"తెలంగాణలో అవినీతి, కుటుంబానికి వ్యతిరేకంగా ప్రజలు, యువతలో పెల్లుబికుతున్న ఉన్న ప్రజాగ్రహాన్ని యావత్ దేశం గమనిస్తోంది. నేను తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాను. పేదలను లూటీ చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కొందరు విచారణ నుంచి తప్పించుకునేందుకు జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అవినీతిపరులు కూటమి కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తెలంగాణతో పాటు దేశ ప్రజలు దీనిని గమనిస్తున్నారు. అర్థం చేసుకుంటున్నారు. అవినీతి, వారసత్వం అభివృద్ధికి అతిపెద్ద శత్రువులు. భాజపా అవినీతి పెకిలించేందుకు కట్టుబడి ఉంది." -నరేంద్ర మోదీ, ప్రధాని
20 నుంచి 22ఏళ్లుగా తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మోదీ తెలిపారు. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ మోదీని దూషించడమే పనిగా పెట్టుకుందని అయినా పర్వాలేదని స్పష్టం చేశారు.
"తెలంగాణలో అధికారం దక్కిన పార్టీ.. మోదీని దూషించడం, భాజపాను విమర్శించడంపైనే దృష్టి పెట్టింది. నిన్న దిల్లీలో ఉన్నారు. తర్వాత కర్ణాటక, తమిళనాడులో ఉన్నారు. రాత్రి ఆంధ్రాలో ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. మీరు ఎందుకు అలసిపోరాని అడుగుతున్నారు. నేను రోజు రెండు, రెండున్నర, మూడు కిలోలు తిట్లను తింటాను. ఇవన్నీ నాలో పోషకాలుగా మారిపోతాయి. ఒక సానుకూలమైన శక్తిగా మారుతాయి. మీరు మోదీని ఎంతా తిట్టినా పట్టించుకోను. భాజపాను దూషించినా పర్వాలేదు. అలానే మేము పెద్దవాళ్లమయ్యాము. కానీ తెలంగాణ ప్రజలను దూషిస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. మోదీ, భాజపాను దూషిస్తే తెలంగాణకు లాభం జరుగుతుందనుకంటే అలానే చేయండి. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను దెబ్బతీయాలనుకుంటే పోరాటం తీవ్రంగా ఉంటుంది." -నరేంద్ర మోదీ, ప్రధాని
తెలంగాణలో పాజిటివ్ అజెండాతో భాజపా ముందుకు వస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కష్టపడి పని చేస్తున్నారని కొనియాడారు. కేంద్ర పథకాలు రానివారి వద్దకు వెళ్లి అందేలా చూడాలని మోదీ దిశానిర్దేశం చేశారు.
ఇవీ చదవండి: PM Modi in Ramagundam : 'సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచనే కేంద్రానికి లేదు'
modi speech at begumpet : వాళ్లని వదిలే ప్రసక్తే లేదు.. స్వాగత సభలో మోదీ వార్నింగ్
'ఆ స్టేడియానికి మోదీ పేరు తీసేస్తాం.. 10లక్షల ఉద్యోగాలిస్తాం'.. కాంగ్రెస్ మేనిఫెస్టో