వివిధ మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టుల అంచనా వ్యయం, ప్రతిపాదనలకు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు రంగం సిద్దమవుతోంది. పదే పదే అంచనాల సవరింపు అన్న అంశం ఉత్పన్నం కాకుండా ప్రాథమిక అంచనాల ప్రతిపాదనల రూపకల్పన కోసం నీటిపారుదల శాఖ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. దానికి కొనసాగింపుగా ప్రభుత్వం, గుత్తేదార్లకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు మేనేజ్మెంట్ సిస్టంలో మార్పులు చేసేందుకు బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్ కమిటీ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిపై కార్యదర్శుల కమిటీ సమీక్ష నిర్వహించింది. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్, పురపాలక, ఆర్ అండ్ బీ శాఖల కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసరాజు, ఈఎన్సీలు పాల్గొన్నారు.
ఏకమొత్తంగా అంచనాలకు పరిపాలనా అనుమతులు కాకుండా కాంపోనెంట్ల వారీగా అనుమతులు, ధరల్లో తేడాలకు సంబంధించి ఒకే రకమైన విధానం, తుదిబిల్లు తర్వాత మిస్సింగుల సమర్పణకు మూడేళ్ల గడువు తదితర బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ కమిటీ ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. కొన్ని సవరణలు, ప్రతిపాదనలను కార్యదర్శులు సూచించారు. వాటన్నింటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తుది కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదించనున్నారు.
ఇదీ చదవండి:
President southern sojourn: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దక్షిణాది విడిదికి రంగం సిద్ధం