హైదరాబాద్‌లో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. నగరంలో దాదాపు 40లక్షల వాహనాలు ఉండగా... రోజుకు వెయ్యి వాహనాలు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందిని తీర్చడానికి బాహ్యవలయ రహదారి ఎంతగానో ఉపయోగపడుతోంది. బెంగళూరు, విజయవాడ, వరంగల్, ముంబయి జాతీయ రహదారులను కలుపుతూ నిర్మించిన ఈ రహదారిపై భారీ వాహనాలు, కార్లు నిత్యం వేల సంఖ్యలో ప్రయాణిస్తాయి. ప్రాంతీయ రహదారులు కూడా అనుసంధానం కావడం వల్ల రాకపోకలకు ఎంతో అనువుగా ఉంది. 8 లేన్లుగా... 156 కిలోమీటర్ల పొడవైన బాహ్యవలయ రహదారి శంషాబాద్ విమానాశ్రయంతో పాటు గచ్చిబౌలి, హార్డ్‌వేర్ పార్కుకు చేరుకునేందుకు సులభంగా ఉంటుంది. బాహ్యవలయ రహదారిపై 19 ఇంటర్‌చేంజ్‌లు ఉన్నాయి. ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని బాహ్యవలయ రహదారిపై వేగపరిమితిని గంటకు 120కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు తగ్గించారు. భారీ వాహనాలకు 80కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని పరిమితిగా నిర్ణయించారు.
నిబంధనలు పాటించకపోవడం వల్లే..
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన బాహ్యవలయ రహదారిపై నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. గతేడాది జరిగిన 140 ప్రమాదాల్లో 50కి పైగా మృతి చెందారు. 2018లో జరిగిన 104 ప్రమాదాల్లో 48మంది మృతి చెందగా... 43మంది తీవ్రంగా గాయపడ్డారు. 2019లో జరిగిన 107 ప్రమాదాల్లో 45మంది మృతి చెందగా... 34మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాలను నివారించడానికి అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. అతివేగం, లేన్ పాటించకపోవడం, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
24 గంటల పాటు పర్యవేక్షణ
సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి జిల్లా పోలీసుల పరిధిలోకి బాహ్య వలయ రహదారి వస్తుంది. పోలీసులు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి.. 24గంటల పాటు నిఘా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అధికారులు పనులను కూడా కొనసాగిస్తున్నారు. మరో నాలుగైదు నెలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తవుతుంది. ప్రస్తుతానికి బాహ్యవలయ రహదారి టోల్ గేట్ల వద్ద మాత్రమే సీసీటీవీ కెమెరాలున్నాయి. వీటన్నింటిని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించి... 24గంటల పాటు పర్యవేక్షిస్తారు. ప్రమాదం చేసి తప్పించుకోవాలని చూసినా.. దొంగతనం చేసిన వాహనాలైనా.. నేరం చేసి పారిపోయేందుకు ఉపయోగించే వాహనాలనైనా... ఆటోమేటెడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిస్టం ద్వారా గుర్తించే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
బాహ్యవలయ రహదారిపై ప్రమాదాలను ఈ ఏడాది 30శాతానికి పైగా తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కరోనా దృష్ట్యా ఇంటర్ కళాశాలలు మూసివేత