Precautions to be taken while bursting firecrackers: ఇంటిల్లిపాదీ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగే దీపావళి. దివ్వెల పండగంటే అందరికీ ఉత్సాహమే.. టపాసులు కాల్చడంతో పాటు పిండివంటలు నోటిని తీపిచేస్తే.. నట్టింట్లో సిరులు కురిపించాలని లక్ష్మీదేవిని పూజించడం మరో ఆనవాయితీ. ఏటా ఆశ్వియుజ బహుళ అమావాస్య రోజున వెలుగుల పండగను జరుపుకుంటారు.
ఈనెల 25న సూర్య గ్రహణం ఉండటంతో ఒక రోజు ముందుగానే అంటే 24నే దివ్వెల పండగ పండగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. బాణసంచా కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో ఏ మాత్రం అశ్రద్ధ తగదు. ఆనందోత్సాహాల పండగకు ఇంట్లో వారంతా ఒకేసారి బయటికి వచ్చి టపాసులు కాల్చినప్పుడు జాగ్రర్తతో ఉండాలి.
అగ్నిమాపక శాఖ సూచనలివే: ఇంటి ముందు టపాసులు కాల్చేటప్పుడు పిల్లలను ఓ కంట కనిపెడుతుండాలి. పెద్దల సమక్షంలోనే పిల్లలు బాణసంచా కాల్చేలా పెద్దలు పర్యవేక్షణ చేయాలి. ఇంటి ముందున్న రోడ్డు, వీధుల్లో కాల్చేటప్పుడు వచ్చిపోయే వాహనాలు, పాదచారులను గమనించాలి. ఇంటి వరండాలో ఆరేసిన దుస్తులు, ఇతరత్రా సామగ్రి ఉంటే ముందుగా వాటిని తీసేయ్యాలి.ఇంటిపైన కూడ దుస్తులను తీసేయాలి. బాంబులు కాల్చేటప్పుడు ఇంటి ముందు బక్కెట్లో నీటిని సిద్ధంగా పెట్టుకోవాలి. కాటన్ దస్తులనే ధరించడం ఉత్తమం. మహిళలు చీరలు ధరించినప్పుడు పైట(కొంగు)ను నడుముకు బిగించాలి.
చుడీదార్లు వేసుకునేవారు వదులుగా ఉన్నవి కాకుండా బిగుతుగా ఉండేవి వేసుకోవాలి. బాంబులు కాల్చుతున్న సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను పూర్తిగా మూసివేయాలి. రాకెట్ బాంబులు, తారాజువ్వలు కిటికీల్లోంచి లోనికి వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. దుస్తులకు మంటలు అంటుకుంటే వెంటనే ఆర్పడానికి ప్రయత్నించాలి. బాధితులు ముఖాన్ని రెండు చేతులతో మూసుకుని కంటిచూపు తసమస్య రాకుండా ఇలా చేయాలి. నేలపై పడుకొని అటూ ఇటూ దొర్లాలి. దుప్పటి, కంబళి తదితర దళసరి వస్త్రాలతో మంటలను ఆర్పాలి.
40 శాతం పెరిగిన ధరలు: టపాసుల ధరలు ఈ ఏడాది 40 శాతం వరకు పెరిగాయి. గతంలో చైనా నుంచి క్రాకర్స్ దిగుమతి చేసుకునేవారు. ప్రస్తుతం ఆ దేశం నుంచి దిగుమతులు బంద్ కావడంతో దేశీయంగానే తయారుచేస్తున్న టపాసులను వినియోగించనున్నారు. పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగని గ్రీన్ కాకర్స్ అందుబాటులోకి వచ్చాయి. గతంలో పెద్ద శబ్ధంతో పేలే బాంబులు ప్రస్తుతం తక్కువ శబ్ధంతో కాలనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ విభాగం నిబంధనల ప్రకారం వీటిని తయారు చేశారు.
లక్ష్మీపూజ చేసే సమయంలో: వస్త్ర దుకాణాలు, వాణిజ్య కాంప్లెక్సులు, మాల్స్, ఇతరత్రా వ్యాపారాలు చేసేవారు లక్ష్మీదేవి, కుబేర పూజలు చేయడం ఆనవాయితీ. పూజలో వెలిగించే దీపాలకు తక్కువ నూనె పోయాలి. జ్యోతులు వెలుగుతున్న సమయంలో అక్కడే ఉండాలి. ఒకవేళ ఎక్కువ నూనె పోసి, దుకాణాన్ని బంద్‌చేసి వెళ్లిపోతే అనూహ్యంగా మంటలు రేగే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎలాంటి ప్రమాదం జరిగినా తక్షణమే సమాచారం ఇవ్వండి.
చేతులతో పట్టుకొని కాల్చొద్దు: టపాకాయలను చేతులతో పట్టుకొని కాల్చొద్దు.. ఒక్కోసారి అవి పేలలేదని దగ్గరకు వెళ్లి చూడడం చేయవద్దు. అనూహ్యంగా పేలితే గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో, వరండాలో బాంబులు పేల్చవద్దు. వాటి నుంచి వెలువడే శబ్ధం.. పొగతో వినికిడి, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఇంట్లో వృద్ధులు, చిన్నపిల్లలు, వ్యాధిగ్రస్థులకు ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు జరిగినప్పుడు నీటితో మంటలను ఆర్పడానికి ప్రయత్నించాలి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి తక్షణమే చికిత్స అందేలా చూడాలి.