రాష్ట్రంలో మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం కుదరదని.. ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. సర్కారు.. తమ బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటని పొన్నం ఆరోపించారు.
క్వింటా మొక్కజొన్నకు రూ. 1,850 కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత అని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. రైతులు కొత్తగా గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, పండించిన పంటను కొనుగోలు చేయాలని మాత్రమే కోరుతున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే న్యాయంగా కనీస మద్దతు ధరకు అదనంగా వస్తుందనుకున్న రైతుల పరిస్థితి ఇప్పుడు పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిందని పొన్నం విమర్శించారు. తక్షణమే బేషరతుగా తెలంగాణ రైతులకు క్షమాపణలు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
రైతు పక్షపాతి ప్రభుత్వమని ప్రకటనలకే పరిమితం కాకుండా.. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కనీస మద్దతు ధరను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పొన్నం ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః గవర్నర్ తమిళి సై సౌందర రాజన్కు కాంగ్రెస్ నేతల లేఖ