మోదీ ప్రభుత్వం రెండోసారి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ అభివృద్ధిలో విఫలమయ్యారని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. లాక్డౌన్ విషయంలో, దేశ నిరుద్యోగిత, పలు అంశాల్లో సఫలం కాలేదని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్న మూడు అంశాలు కూడా ప్రజల మధ్య చిచ్చుపెట్టేవిగా ఉన్నాయని తెలిపారు. మోదీ ఏడాది పాలనలో త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య తీర్పు అంశాలు పరిష్కారం చేశామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పడం సరికాదన్నారు. ఆర్థిక వ్యవస్థ ఏమైనా మెరుగు పడిందా, రైతులకు ఏదైనా మేలు చేశారా అని నిలదీశారు.
ఏం చేసిందో చెప్పాలి..
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం భాజపా ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గల్లీలో కొట్లాట.. దిల్లీలో దోస్తీ రాజకీయాలే భాజపా చేస్తోందని ధ్వజమెత్తారు. కరోనా విషయంలో కూడా భాజపా రాజకీయాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ఏడాది పాలనలో తెలంగాణకు చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : మిడతా.. మిడతా ఊచ్... వస్తే చంపేస్తామోచ్!