హైదరాబాద్ రాజ్‌భవన్‌లో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని సంబురాలు అంబరాన్నంటాయి. సంప్రదాయబద్ధంగా సాగిన వేడుకల్లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి. సౌందరరాజన్, ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె వాతావరణం ప్రతిబింబించే రీతిలో తీర్చిదిద్దిన ప్రాంగణంలో సంప్రదాయ పొంగల్ వంటకం గవర్నర్ తయారు చేశారు. ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం గవర్నర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పొంగల్ వంటకం అంటే "చిందులు వేయడం" లేదా "ఉడకబెట్టడం" అని సమృద్ధి, శ్రేయస్సు సూచిస్తున్న దృష్ట్యా హార్వెస్ట్ ఫెస్టివల్‌లో భాగంగా సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని గవర్నర్ తెలిపారు.
గాలిపటాల ఎగరవేత...
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల స్ఫూర్తి చాటుతూనే వినూత్న రీతిలో కొవిడ్ టీకా, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ సందేశాలతో కూడిన అందమైన గాలిపటాలను గవర్నర్ ఉత్సాహంగా ఎగురవేశారు. "మా వ్యాక్సిన్- మా ప్రైడ్," "మా దేశం- మా వ్యాక్సిన్," "మా టీకాలు- సురక్షితమైన వ్యాక్సిన్లు", "ఆత్మనిర్భర్ భారత్" వంటి సందేశాలు గాలిపటాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళుతున్నామని గవర్నర్ వెల్లడించారు. ఈనెల 16న దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న భారీ టీకా కార్యక్రమాల సందర్భంగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా గాలిపటాలపై సందేశాలున్నాయన్నారు.
యోధులకు కృతజ్ఞతలు...
మొదటి దశలో ఫ్రంట్ లైన్ యోధులకు ప్రాధాన్యత ప్రాతిపదికన ఇవ్వడానికి వ్యాక్సిన్‌లు ప్రోత్సహించడం, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు చెప్పడం కోసం సంక్రాంతి పండుగను వేదికగా చేసుకున్నామని గవర్నర్ తెలిపారు. వ్యాక్సిన్ల అభివృద్ధి, ఉత్పత్తి సాధ్యం చేసిన ఆత్మనిర్భర్ భారత్ దృష్టి, చొరవకు సూచకంగా గాలిపటాలపై సందేశాలు ద్వారా ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కరోనా టీకాలు అత్యంత సురక్షితంగా ఉన్నాయన్న సందేశం, భరోసా యావత్ ప్రజలకు చాటి చెబుతున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రంగు రంగుల పతంగులు.. ఎగిరేద్దామా!