Police Remand Report in Sathvik Suicide Case: గత బుధవారం హైదరాబాద్ శివారు నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో క్లాస్‌రూంలోనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కీలక అంశాలు బయటకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు.. తల్లిదండ్రుల ఫిర్యాదు, విద్యార్థి వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ చేపట్టారు. కాలేజీలో వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది దుర్భాషలాడటం, చితకబాదినట్లు వివరించారు. ఈ తరుణంలో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. ఆత్మహత్య వెనుక కారణాలు, సాత్విక్ మానసికంగా ఎంత క్షోభపడ్డాడో అందులో ప్రస్తావించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన సాత్విక్ 2022లో శ్రీచైతన్య కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చేరాడు. అదే కళాశాలలోని వసతి గృహంలో ఉంటున్నాడు. కాలేజీలో చేరిన తొలి రోజుల్లో తన గదిలో నీరు రావడం లేదంటూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా.. అతనిపై వార్డెన్ నరేశ్ కక్షగట్టాడు. వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేశాడు. ఇద్దరు ప్రిన్సిపళ్లు, వైస్ ప్రిన్సిపల్‌కు అవాస్తవాలు చెప్పి సాత్విక్‌పై కక్ష గట్టేలా చేశాడు. అతడిని వారు మానసికంగా, శారీరకంగా వేధించారు. ఆహారం, తాగు నీరు, శౌచాలయాల్లో నీరు సదుపాయాలపై ప్రశ్నించిన విద్యార్థులను వార్డెన్ లక్ష్యంగా చేసుకునేవాడు.
గంటల కొద్దీ ఛాంబర్‌లో వేధించే వారు: కొన్నిసార్లు అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టేవాడు. ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు నిలబెట్టేవాడు. తన పేరిట అనేక ఆస్తులున్నాయని.. మీ పేరిట ఎన్ని ఉన్నాయో చెప్పాలంటూ సాత్విక్‌తో పాటు ఇతర విద్యార్థులను వాచ్‌మెన్ సహాయక ఉద్యోగాలకూ పనికిరారంటూ కళాశాల అడ్మిన్ ప్రిన్సిపల్ నరసింహాచారి హేళన చేసేవాడు. సాత్విక్‌ను మరో ప్రిన్సిపల్ జగన్ పిలిపించుకుని అసభ్య పదజాలంతో అవమానించాడు. గంటలకొద్దీ ఛాంబర్‌లో నిల్చోబెట్టుకునేవాడు. సాత్విక్‌తో వైస్ ప్రిన్సిపల్ శోభన్‌బాబు కటువుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థుల ముందు అవమానించాడు.
వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య: ఆ విషయాన్ని అన్న మిధున్‌కు సాత్విక్ చెప్పగా కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. తాము ఇలాగే బోధిస్తామని, కాలేజీలో ఉండాలంటే అవన్ని భరించాలని, లేకపోతే వెళ్లిపోవాలని నరసింహాచారి, శివరామ కృష్ణారెడ్డి దురుసుగా సమాధానమిచ్చారు. వారి వేధింపులు ఎక్కువగా కావడంతో సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. శ్రీచైతన్య కళాశాల అడ్మిన్ ప్రిన్సిపల్ నర్సింహాచారి అలియాస్ ఆచారి, ప్రిన్సిపల్ శివరామకృష్ణారెడ్డి, హాస్టల్ వార్డెన్ నరేశ్, వైస్ ప్రిన్సిపల్ శోభన్ బాబును పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆ నలుగురిని చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇవీ చదవండి: