వలస కార్మికుల ఆధార్ కార్డు, మొబైల్ నంబరు, ఫొటో తీసుకుని... వారు రైల్వే స్టేషన్లకు చేరుకునేందుకు వీలుగా పోలీసులు పాసులను జారీ చేస్తున్నారు. ఎప్పుడు రైలు వస్తుంది ? ఏ స్టేషన్‌కు వెళ్లాలి..? అనే విషయాలు ఎస్‌ఎంఎస్ పంపిస్తామని, అప్పటి వరకు ఇప్పుడున్న చోటే ఉండాలంటూ చెప్పి పంపుతున్నారు.
రసీదు ఉంటే చాలు...
అన్ని ప్రాంతాల్లో ఎడం పాటించేలా స్థానిక పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్నిచోట్ల సంఖ్య ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడం వల్ల ఠాణాలు కిక్కిరిసిపోయాయి. అన్ని ఠాణాల్లో ప్రత్యేక యాప్‌లో ఒక్కో కార్మికుడి నుంచి 14 అంశాల సమాచారాన్ని సేకరించి అప్‌లోడ్ చేస్తున్నారు. అనంతరం రసీదు ఇస్తున్నారు. ఆ రసీదు చూపిస్తేనే సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తారంటూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కాలినడకన రైల్వే స్టేషన్లకు లేదా స్వస్థలాలకు వెళ్లొదంటూ నచ్చజెబుతున్నారు. ‘
సొంతూళ్లకు పంపే వరకు యజమానులే కార్మికుల బాగోగులు చూసుకోవాలని చెబుతున్నాం’ అని కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎస్.లక్ష్మీనారాయణ తెలిపారు. పాతబస్తీలో 17 ఠాణాల పరిధిలో 30వేలకు పైగా వలస కార్మికులున్నారు. సోమవారం ఒక్కో ఠాణాకు 500మందికి పైగా కూలీలు వచ్చారు. షేక్‌పేటనాలా వద్ద 100 మంది కూలీలు రోడ్డుపై బైఠాయించారు. స్వస్థలాలకు పంపాలని ఆందోళనకు దిగారు. గోల్కొండ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి నచ్చజెప్పి పేర్లు నమోదుకు పంపారు.
సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో కూలీలు చేరుకోవడం వల్ల కొద్దిసేపు గందరగోళానికి దారి తీసింది. గోపాలపురం ఠాణా ఎదుట వర్షంలోనూ కార్మికులు వివరాల నమోదుకు ఎదురుచూశారు.
ఆ కూలీలకు విముక్తి..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండోదశ విస్తరణ పనులకు వచ్చి చిక్కుకున్న కార్మికులకు విముక్తి లభించింది. కొన్ని రోజులుగా ఇక్కడి తాత్కాలిక కాలనీల్లో 4 వేల మందికి పైగా కార్మికులు ఉంటున్నారు. వీరు వెళ్లకుండా గుత్తేదారులు అడ్డుపడ్డారు. సమాచారం అందుకున్న విమానాశ్రయ అధికారులు, పోలీసులు వలస కార్మికులకు విముక్తి కల్పించడంత వల్ల నడుచుకుంటూ స్వగ్రామాలకు బయలుదేరారు.