ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహ ధ్వంసం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ 'భాజపా- జనసేన' సంయుక్తంగా రామతీర్థ ధర్మయాత్ర తలపెట్టాయి. దీనికి పోలీసు శాఖ నుంచి అనుమతులు సైతం పొందారు. అయితే జిల్లాలో శాంతిభద్రతలు, కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా రామతీర్థంలోని ఆలయ పరిసరాల్లో సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు లేవని జిల్లా ఎస్పీ రాజకుమారి సోమవారం ప్రకటన విడుదల చేశారు.
ఎవరైనా చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు ఆంక్షలు విధించినా ధర్మయాత్ర చేపట్టి తీరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ మేరకు ఆయన రామతీర్థం జంక్షన్ చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమువీర్రాజును పోలీసులు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ తరలించారు.
ఎక్కడికక్కడే..
భాజపా-జనసేన ధర్మయాత్ర నేపథ్యంలో రామతీర్థం జంక్షన్‌లో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జంక్షన్‌కు భాజపా నేత సోము వీర్రాజు చేరుకున్నారు. భాజపా, జనసేన నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపైనే భాజపా, జనసేన నేతల బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జనసేన నాయకురాలు యశస్విని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు విజయనగరంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మక జయరాజును పోలీసులు గృహనిర్బంధం చేశారు.
విశాఖ భాజపా కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విశాఖ నుంచి రామతీర్థం వెళ్లేందుకు భాజపా, జనసేన శ్రేణులు సిద్ధమయ్యాయి. పోలీసులు మధురవాడ స్టేడియం, భీమిలి బీచ్ రోడ్డులో భారీగా మోహరించారు. తగరపువలస జాతీయ రహదారిపై విజయనగరం వెళ్లే మార్గంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: సింగరేణి కాలనీ బస్తీవాసుల క'నీటి' కష్టాలు..