Imposition of Section 144 at TSPSC office: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ కార్యాలయం వద్ద నిరసనలు మిన్నంటాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష పేపర్‌ను కమిషన్ సిబ్బందే లీక్ చేయటంపై.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కార్యాలయం పరిరసరాల్లో పోలీసుల144 సెక్షన్ విధించారు. పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు చేయొద్దని సూచించారు. కార్యాలయం పరిసర ప్రాంతాల్లో నలుగురు అంతకు మించి గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి బోయిన్ పల్లి ఠాణాకు తరలించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేయాలని నినదించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై బీజేవైఎమ్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. లీకేజీ కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
TSPSC Question Paper Leakage Case: టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ప్రయత్నించారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆప్ విద్యార్థి సంఘాల నేతలు కార్యాలయంలోకి చొచ్చుకునేందుకు వెళ్లగా అరెస్ట్ చేసిన పోలీసులు గోషామహల్ ఠాణాకు తరలించారు. కార్యాలయం వద్ద ఇంటర్ ఐకాస రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డిని అరెస్టు చేశారు.
పరీక్షల నిర్వహణలో కమిషన్ వైఫల్యం చెందిందని ఆరోపించిన ఆయన లక్షలాది మంది యువత జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వరుస ఆందోళనల దృష్ట్యా టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోలీసు అధికారులు అదనపు భద్రత ఏర్పాటు చేశారు.
వెలుగులోకి వస్తున్న.. ప్రవీణ్ లీలలు: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ లీలలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ప్రవీణ్, సహచర ఉద్యోగి రాజశేఖర్ నుంచి ఏఈ సివిల్, టౌన్ ప్లానింగ్ ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో గురుకుల ప్రశ్నపత్రాలు సైతం లీకై ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు దాన్ని నిర్ధారించేందుకు ప్రవీణ్‌ను పలు పశ్నలు అడుగుతున్నారు. నిందితుల నుంచి 4 పెన్ డ్రైవ్‌లను తీసుకొని అందులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.
ఇవీ చదవండి:
TSPSC పేపర్ లీకేజీ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు.. మరోసారి అట్టుడికిన కమిషన్ పరిసరాలు
AE పరీక్ష సంగతేంటి.. రద్దవుతుందా.. కొనసాగుతుందా?
TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం.. వెలుగులోకి వస్తున్న ప్రవీణ్ లీలలు