పోలీస్ ఠాణాల్లో నమోదు చేసుకుంటున్న వలస కార్మికులు, కూలీల వివరాలను రాష్ట్రాలవారీగా విభజించి జోన్లవారీగా జాబితాను సిద్ధం చేస్తున్నారు. అనంతరం కమిషనర్ అంజనీకుమార్, సంయుక్త కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషిల సూచనల మేరకు కూలీలను రైల్వేస్టేషన్లకు తరలించాలని చూస్తున్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా వారికి వైద్యసేవలు ముందుగా లేదా రైల్వేస్టేషన్ల పరిసర ప్రాంతాల్లోనూ నిర్వహించేందుకు ఏర్పాట్లును పరిశీలిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని, బస్సుల్లో తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయా జోన్ల డీసీపీలకు వివరించారు.
బతుకు భయం... లాక్‌డౌన్ ఇబ్బందులే...
సొంతూళ్లకు వెళ్లేందుకు పోలీస్ ఠాణాలు, డీసీపీ కార్యాలయాలకు వచ్చిన వలస కార్మికులను, కూలీలను ఈటీవీ భారత్’ పలకరించగా.. బతుకు భయం, లాక్‌డౌన్ ఇబ్బందుల కారణంగా స్వస్థలాలకు వెళ్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, టోలీచౌకీ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల పనులు, నగరంలోని కొత్త రహదారుల నిర్మాణ పనుల కోసం జనవరి నెలలో వచ్చామని వివరించారు.
లాక్‌డౌన్ ప్రారంభమైన మార్చి నెల తమకు బాగానే ఉన్నా.. ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు తెలిపారు. కరోనా వైరస్ సోకుతుందన్న అనుమానం... తినేందుకు తిండిలేక పస్తులు ఉండాల్సి రావడం వల్ల యాచకుల కంటే తమ పరిస్థితి దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. వంట చేసుకునేందుకు డబ్బు లేకపోవడం వల్ల పిల్లలు ఏడుస్తున్నారని, దాతలు ఇచ్చే ఆహార పొట్లాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితుల వల్లే సొంతూరుకు వెళ్లాలన్న ఆలోచన కలిగిందని కన్నీళ్ల పర్యంతమయ్యారు.
రైలు బయలుదేరే సమయానికి...
శంషాబాద్ ఎయిర్‌పోర్టు కాలనీలో ఉంటున్న వలస కార్మికులు, కూలీల్లో 1200 మంది సోమవారం సాయంత్రం స్వస్థలాలకు బయలుదేరారు. శంషాబాబాద్ పోలీసులు నిలువరించినా వారు అలాగే వచ్చారు. ఆరాంఘర్ వద్ద రాజేంద్రనగర్ పోలీసులు తిరిగివెళ్లాలంటూ నచ్చజెప్పినా వినకుండా ముందుకే నడిచారు. బహదూర్‌పుర క్రాస్‌రోడ్స్‌కు చేరుకోగానే శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ పోలీస్ సిబ్బందితో వారిని అక్కడే ఆపారు. వలస కార్మికులు పోలీసులతో వాగ్వాదానికి దిగినా శాంతపరిచి వెనక్కి పంపించేసరికి ఆరు గంటలు పట్టింది. ఈ ఘటన నేపథ్యంలో వలస కార్మికులకు ముందుగా సమాచారం ఇవ్వకుండా సరిగ్గా రైలు బయలుదేరే సమయానికి వీరిని తీసుకురావాలని నిర్ణయించారు.