Teachers Protest against GO 317: ఉపాధ్యాయుల బదిలీలు, దంపతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ప్రగతి భవన్ ముట్టడికి.. పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు పలుచోట్ల భద్రత పెంచారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జీవో 317 బాధిత ఉపాధ్యాయ దంపతుల మీడియా సమావేశం సందర్భంగా పోలీసులు కట్టడి చేశారు. సమావేశం అనంతరం ఉపాధ్యాయులు ప్రగతి భవన్ ముట్టడికి వెళతారన్న అనుమానంతో పోలీసులు ప్రెస్‌క్లబ్‌కు తాళాలు వేసి ఎవరినీ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం దృష్ట్యా పోలీసులు ముందస్తు కట్టడి చర్యలకు దిగారు.
నేను పనిచేసేది నల్గొండ జిల్లా. నా భర్తకు రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్. నేను విధులకు హాజరవ్వాలంటే 125 కి.మీలు ప్రయాణించాలి. గర్భిణిగా ఉన్న సమయంలో రోజూ 6 గంటలు ప్రయాణానికే సరిపోయేది. ఇంట్లో వాళ్లతో గడిపేందుకు సమయం ఉండదు. కుటుంబానికే న్యాయం చేయనప్పుడు ఇక విద్యార్థుల భవిష్యత్తుకు ఏం భరోసా ఇవ్వగలం. ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్.. మా బాధలను అర్థం చేసుకుని మాకు ఒకే జిల్లా కేటాయించాలి. --- సుమ, ఉపాధ్యాయురాలు, నల్గొండ జిల్లా
ఉపాధ్యాయ దంపతులు వేర్వేరుగా ఉండొద్దనే మంచి ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జీవో 317 ప్రవేశపెట్టడం సంతోషకరమే. కానీ కొన్ని జిల్లాలకు న్యాయం చేసి మరి కొన్ని జిల్లాలను బ్లాక్‌లో పెట్టడం బాధాకరం. ఇద్దరు జిల్లాలు వేర్వేరు కావడంతో అటు కుటుంబానికి, ఇటు విద్యార్థులకు సరైన న్యాయం చేయలేకపోతున్నాం. మా సమస్యలపై కేసీఆర్ దృష్టి సారించి.. న్యాంయ చేయాలని కోరుతున్నాం. ---మురళి, ఉపాధ్యాయుడు, సిద్ధిపేట జిల్లా
స్థానిక జిల్లా కాకపోయినా
సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో తమను ఒకే జిల్లాలో కేటాయించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉపాధ్యాయ దంపతులు నిరసన వ్యక్తం చేశారు. బదిలీలకు సంబంధించి స్పౌజ్ కేసులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో 317 ప్రకారం 19 జిల్లాల్లో అమలు చేయడం సంతోషమేనని.. కానీ మిగిలిన 13 జిల్లాల్లో బ్లాక్ చేయడం తగదని వాపోయారు. స్థానిక జిల్లా కాకపోయినా ఇద్దరినీ ఒకే జిల్లాలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే తమకు స్థానికత కొరవడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్ర కేబినెట్ భేటీ.. రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశం!