Police Case Filed on Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారుల పరస్పర ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఫిర్యాదుతో ఐటీ అధికారి రత్నాకర్‌పైనా కేసు నమోదయ్యింది. రెండు ఫిర్యాదులపై ఇప్పటికే బోయిన్‌పల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం నమోదు చేసిన జీరో ఎఫ్ఐఆర్ను బోయిన్‌పల్లి పోలీసులు దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఈ విషయాన్ని ఐటీ వర్గాలు స్వయంగా వెల్లడించారు. సోదాలు పూర్తయ్యాక ఆయనకు సమన్లు జారీ చేసినట్లు తెలిపాయి. తనిఖీలు చేసిన ప్రతిసారి సమన్లు ఇవ్వడమనేది ప్రక్రియలో భాగమని చెప్పాయి. మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేసినట్లు వివరించాయి. పలు కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నాయి.
మల్లారెడ్డి, ఆయన కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బంధువులు, సన్నిహితులు, వ్యాపార భాగస్వాములు, కళాశాలలు, కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా నగదు, బంగారం, దస్త్రాలకు సంబంధించి అధికారులు మంత్రికి నోటీసులు ఇచ్చారు. వాటిపై వివరణ కోరారు.
మరోవైపు ఐటీ సోదాలపై రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం, బీజేపీ కుట్రలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తమనే కాదు సీఎం కేసీఆర్‌ను ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. రెండురోజుల పాటు మొత్తం కుటుంబాన్ని ఐటీ శాఖాధికారులు భయభ్రాంతులకు గురిచేశారని మంత్రి ఆరోపించారు. తనను మానసికంగా కుంగదీయడానికే సోదాలు నిర్వహించారని ఆయన ఆక్షేపించారు. ఇంతా చేసి ఐటీ అధికారులు పట్టుకుంది కేవలం రూ.28 లక్షలు మాత్రమేనన్నారు.
ఇవీ చదవండి: