కరోనా భయంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమైతే.. పోలీసులు మాత్రం రోడ్లపై విధులు నిర్వహిస్తూ కొవిడ్ కట్టడికి కృషి చేస్తున్నారు. లాక్‌డౌన్ మొదలైన దగ్గర నుంచి 60 వేల మంది పోలీసులు షిప్టులు వారీగా రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉండే సమయంలో కూడా పోలీసులు మాత్రం దోమలు, ఉక్కపోతతో కాపలా కాస్తున్నారు. ఇదొక్కటే కాదు... ఎవరికైనా కరోనా నిర్ధరణ అయిందంటే ఇక అప్పటి నుంచీ పోలీసు ఆపరేషన్ మొదలవుతుంది. ఆ వ్యక్తి అంతకు ముందు రెండు వారాల నుంచి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవర్ని కలిశాడో తెలుసుకొని, వారందర్నీ క్వారంటైన్ చేసి, 28 రోజులపాటు వారి కదలికలు గమనించే బాధ్యత పోలీసులదే.
కరోనా అనుమానితుల నుంచి తమకు కూడా వైరస్ సోకే అవకాశం ఉన్నా పోలీసులు వెరవడంలేదు. మాస్క్ ధరించి నిర్భయంగా కరోనా అనుమానితుల వద్దకు వెళ్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్‌లో ఇండోనేషియా వాసుల్ని, నల్గొండలో వియత్నాం నుంచి వచ్చిన వారిని ఆస్పత్రులకు తరలించి, చికిత్స చేయించడంలో పోలీసుల కృషి ప్రసంశలు అందుకుంది.
అక్కడ కేసులు తగ్గాయంటే.. వారి వల్లనే..
ఇక వలస కూలీల తరలింపులోనూ ఖాకీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రాల వారీగా వారిని గుర్తించి, తరలించడం వంటివన్నీ పోలీసులే చూశారు. కంటైన్మెంట్లలో ఎంత హెచ్చరిస్తున్నా జనం రకరకాల కారణాలతో బయటకు వస్తుండటం వల్ల నియంత్రించడం కష్టమవుతోంది. కరీంనగర్‌లో పోలీసులు చేపట్టిన చర్యల వల్లనే కొత్త కేసులు బయటపడలేదన్నది నిర్వివాదాంశం. ఏ ఉద్యోగికైనా వారాంతపు సెలవులు ఉంటాయి. పైగా ప్రస్తుత కరోనా కాలంలో ఎక్కువ మంది ఇళ్ళకే పరిమితమైనా... పోలీసులు మాత్రం ఇంటిపట్టున ఉండలేకపోతున్నారు. ఎనిమిది గంటల చొప్పున మూడు షిప్టులు ఉన్నప్పటికీ... సిబ్బంది కొరత ఉంది. జిల్లా ఎస్పీలు, కమిషనర్లు మొదలు, డీజీపీ కార్యాలయంలో అనేక మంది ఉన్నతాధికారులు అర్ధరాత్రి వరకూ తమ కార్యాలయాల్లోనే గడుపుతున్నారు. పోలీసు పనులు ఇలా ఉంటాయని తాను కలలో కూడా ఉహించలేదని రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఓ సీఐ వాపోయాడు.
విసిగిస్తున్నా.. సహిస్తూ...
తెల్లవారుజామున కూరగాయలు, పండ్ల వాహనాలు నగరానికి వస్తున్నప్పుడు మొదలైన తమ విధులు అర్ధరాత్రి వరకూ కొనసాగుతున్నాయని వెల్లడించారు. చాలా సందర్భాల్లో జనం తమను విసిగిస్తున్నా... అన్నింటినీ ఓర్చుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్ దాడులు