పెట్రో ధరల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ సహా సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. ఎడ్ల బండిపై వచ్చి నిరసన తెలిపారు. కార్యక్రమానికి అనుమతి లేదంటూ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, నాంపల్లి కాంగ్రెస్ ఇంఛార్జీ ఫిరోజ్‌ఖాన్‌తో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ పెరుగుదలను నిరసిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా పెట్రో ధరలను కేంద్రం ప్రభుత్వం పెంచుతోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ప్రజలపై భారం మోపుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్‌లను ధరలను తక్షణమే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తామని సునీతారావు హెచ్చరించారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలో అపశ్రుతి.. ఎడ్లబండిపై నుంచి జారిపడిన దామోదర