Pocharam and Gutta comments on governor: గవర్నర్ తమిళి సై మరోసారి అధికార పక్షం నేతల మాటల దాడి మొదలైంది. రిపబ్లిక్ డే వివాదం ముగియక ముందే.. ఇప్పుడు బడ్జెట్ వివాదం మొదలైంది. గవర్నర్ నుంచి ఇంకా అనుమతి రాకపోవడం, దానిపై కేసీఆర్ సర్కార్ హైకోర్టులో వేసిన పిటిషన్‌తో మళ్లీ ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య యుద్ధం మొదలైంది. గవర్నర్ తీరుపై అధికార పక్షం నేతలు స్పందిస్తున్నారు. ఇవాళ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో గవర్నర్ తీరును మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పరోక్షంగా తప్పుపట్టారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమన్నారు?: గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి వివాదం కొనసాగుతున్న శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. వక్రబుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తిని కొందరు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వారు హద్దుల్లో ఉండాలని హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థల్లో ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలని ఆయన అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా అన్నీ సర్దుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
"రాజ్యాంగం కల్పించిన సంస్కృతిని పక్కన పెట్టడం మంచిది కాదు. ఆ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. నేను రాజ్యాంగానికి సంబంధించిన పదవిలో ఉన్నాను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. వక్రబుద్దితో ఆలోచించే నాయకులు అందరికి మంచి జరగాలని, గాంధీజీ వారిని దీవించాలని కోరుతున్నాను. వారికి మంచి బుద్ది వచ్చేలా చూడాలని మరోకసారి మనవి చేసుకుంటున్నాను. " - గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్
పోచారం శ్రీనివాసరెడ్డి ఏమన్నారు?: స్వాతంత్య్రం ఎవరి సొత్తుకాదని మహాత్ముడు చూపిన బాటలో పాలన సాగించాల్సిన అవసరముందని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని దేశంలో అమలు చేస్తున్నది ఒక్క కేసీఆర్ మాత్రమేనని అన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరిస్తున్నాయని ఆయన తెలిపారు. కేంద్రం కొన్ని విషయాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వాస్తవాలు దాచుకోలేక పోతోందని అన్నారు.
"ప్రపంచమే శాసించగలిగిన శక్తి ఉన్న దేశం మన భారతదేశం. అలాంటి దేశానికి స్వాతంత్య్రం సంపాదించిన మహనీయుడు మహాత్మగాంధీ. గాంధీ చూపిన మార్గాన్ని ఆచరణలో పెట్టాలి. పరిపాలకులు ఆ రకంగా పరిపాలించాలి. స్వాతంత్రం ప్రజల సొత్తు అంతేగాని ఏ ఒక్క వ్యక్తి లేదా నాయకుడుదో కాదు." - పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభాపతి
ఇవీ చదవండి: