ఎమ్మెల్యేల ఎర కేసులో భాజపా నిరాధార ఆరోపణలతో పిటిషన్ దాఖలు చేసిందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. భాజపా పిటిషన్ విచారణలో భాగంగా కేసు దర్యాప్తుపై విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు పూర్తి నిష్పక్షపాతంగా జరుగుతుందని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.
కేసు నమోదై 24 గంటలు గడవక ముందే.. దర్యాప్తు ఏకపక్షంగా జరుగుతోందంటూ భాజపా పిటిషన్ వేసిందని న్యాయస్థానానికి తెలిపింది. గత నెల 26న కేసు నమోదు కాగా.. పంచనామాపై 27న సంతకాలు చేశారంటూ హైకోర్టు వ్యక్తం చేసిన అనుమానంపై వివరణ ఇచ్చింది. మధ్యవర్తులు సంతకం చేసిన తర్వాత తేదీ రాయడంలో పొరపాటు జరిగిందని హైకోర్టుకు తెలిపింది. పంచనామా అనేది స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించిన అంశమని.. భాజపా పిటిషన్‌పై విచారణలో పంచనామాకు ప్రాధాన్యం అవసరం లేదని పేర్కొంది. కేసు దర్యాప్తులో జాప్యం జరిగితే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉన్నందున.. వెంటనే స్టే ఎత్తివేయాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది.
మరోవైపు, ఈ కేసులో నిందితులైన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం దిశానిర్దేశం తోజరుగుతున్న రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదన్నారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోని సిట్‌కు ఈ కేసును అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘నలుగురు ఎమ్మెల్యేలను ఇప్పటివరకు విచారించలేదు. సీఎం మార్గదర్శకంలో జరుతున్న దర్యాప్తుపై నమ్మకం లేదు. తెరాస ప్రయోజనాల కోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రమాదం ఉంది. తెరాస, భాజపా మధ్య గొడవలో బాధితులమయ్యాం’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: