ఉద్యోగాలు భర్తీ చేస్తారా.. లేనిపక్షంలో కారుణ్య మరణాలకు అనుమతిస్తారా? అంటూ గురుకుల పీఈటీ అభ్యర్థులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మహిళా అభ్యర్థులు చిన్నపిల్లలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. తమ గోడును వినిపించేందుకు ప్రగతిభవన్‌కు వెళ్తే అన్యాయంగా అరెస్ట్ చేసి, గోషామహల్ స్టేడియానికి తరలించారని వాపోయారు.
మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ కలిసినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని, సీఎంను కలిసి తమ ఆవేదనను తెలియజేస్తామని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసుకు కౌంటర్ దాఖలు చేయకుండా ఫలితాల ప్రకటనలో జాప్యం చేస్తున్నారని మహిళలు ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తమ బాధలను అర్థం చేసుకుని నియామకాలు చేపట్టాలని కోరారు.