Annapurna Canteens: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో దాదాపు ఒక కోటి జనాభా నివసిస్తోంది. ఆర్థిక స్థితి, నైపుణ్యంతో నిమిత్తం లేకుండా.. అన్ని వర్గాల ప్రజలను హైదరాబాద్ నగరం అక్కున చేర్చుకుంటుంది. దేశంలో విద్యా, నైపుణ్య శిక్షణ, ఉపాధికి భాగ్యనగరం కేంద్రంగా మారింది. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరి బతుకుకు భరోసా కల్పిస్తున్నది. నగరంలో రోజువారీగా వివిధ వృత్తులపై మనుగడ సాగిస్తున్న పేదలు, నైపుణ్యాభివృద్ధి ఉపాధికి శిక్షణ పొందుతూ వేలాది మంది యువత పోటీ పడుతున్నారు.
అటు పేదలు, ఇటు ఉద్యోగార్థుల ఆకలిని తీర్చేందుకు అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. లబ్ధిదారులు నుంచి కేవలం 5రూపాయలకే కడుపునిండా భోజనం అందిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. 2014లో జీహెచ్ఎంసీ చొరవ తీసుకుని ప్రవేశపెట్టిన అన్నపూర్ణ భోజన పథకాన్ని.. ప్రభుత్వం నిరంతరాయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలు చేస్తోంది. 5రూపాయలకే అన్నపూర్ణ భోజనంతో పేదలు, విద్యార్థులు, ఉద్యోగార్థుల ఆకలి తీరుతోంది.
2014 నుంచి 2022 మే నెలాఖరు వరకు 9,67,53,612మంది అన్నపూర్ణ భోజనం చేశారు. ఈ అన్నపూర్ణ భోజనానికి రూ.185కోట్ల 89లక్షలు ఖర్చు చేశారు. కొవిడ్ విపత్తుకు ముందు 150కేంద్రాలు ద్వారా రోజుకు.. 45వేల అన్నపూర్ణ భోజనాలను అందించారు. మొదటి విడత కరోనా లాక్డౌన్లో హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం పూట మొత్తం 373రెగ్యులర్, మొబైల్ కేంద్రాలు ద్వారా పూర్తి ఉచితంగా అన్నపూర్ణ భోజనం అందించారు.
రాత్రి పూట మొత్తం 259రెగ్యులర్, మొబైల్ కేంద్రాలు ద్వారా రాత్రి పూట భోజనం పెట్టారు. ప్రపంచాన్ని గడగడ లాడించిన కొవిడ్ లాంటి విపత్తులో నిరుపేదల ఆకలి బాధను తీర్చేందుకు అన్నపూర్ణ పథకం అక్షయపాత్రగా మారింది. ఆ విధంగా 2020-21లో మొత్తం 2,29,46,080 భోజనాలను.. అన్నార్థుల ఆకలిని తీర్చారు. లబ్ధిదారులు సౌకర్యంగా భోజనం చేయటానికి అన్నపూర్ణ కేంద్రాలకు సీటింగ్ సదుపాయం కల్పించాలని.. ప్రభుత్వం నిర్ణయించింది.
అందులో భాగంగా మొదటగా నగరంలో సీటింగ్ అన్నపూర్ణ క్యాంటీన్లఏర్పాటుకు 32 ప్రాంతాలను గుర్తించి సదుపాయాలు కల్పిస్తున్నారు. రోజూ ఒక్కో భోజనంలో అన్నం, సాంబారు, పప్పుతో పాటు.. పచ్చడితో కూడిన నాణ్యమైన పోషక విలువలున్న భోజనాన్ని అన్నపూర్ణ పథకం కింద ప్రభుత్వం అందిస్తున్నారు.
ఇవీ చదవండి: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఇకపై ఇంటింటికీ బూస్టర్ డోసు!
మరణించిన కొడుకు బతికొస్తాడని 30 గంటలు పూజలు.. ఆ పాము కోసం వేట!