హెల్మెట్.. ద్విచక్రవాహనదారులకు రక్షణకవచం. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి రక్షిస్తుంది. అందుకే ద్విచక్రవాహనదారులకు శిరస్త్రాణం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. శిరస్త్రాణం లేకుండా రోడ్డెక్కితే.. వేల రూపాయలు జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయినా చాలా చోట్ల శిరస్త్రాణం లేకుండా వెళ్తన్న ద్విచక్రవాహనదారులు కనిపిస్తూనే ఉంటారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని దయాల్బాగ్లో శిరస్త్రాణం ప్రాముఖ్యత గుర్తించి ద్విచక్రవాహనదారులే కాదు, సైకిల్, కారు నడిపేవారితో పాటు పాదచారులు కూడా హెల్మెట్‌ను ధరించి అవగాహన కల్పిస్తున్నారు.
రోడ్డుభద్రతపై సందేశం..
దయాల్బాగ్ ప్రజలు రోడ్డు ప్రమాదాలనుంచి రక్షించుకునేందుకు హెల్మెట్‌ను తమ జీవితంలో భాగం చేసుకున్నారు. యువకులు, చిన్నారులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు, మహిళలు, పురుషులు, ముసలివారు వయసు తేడా లేకుండా హెల్మెట్‌ను ధరించి రోడ్డు భద్రతపై ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు.
కారణం ఇదీ..
ఇటీవల రోడ్డు భద్రత, ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు అధికారులు. హెల్మెట్ ధరిస్తే కలిగే ఉపయోగాలను సవివరంగా చెప్పారు. అధికారుల సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు దయాల్బాగ్ ప్రజలు. పాదచారులు, సైకిల్, కారులో రోడ్డుపై వెళుతున్నప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం పొంచి ఉందో ఊహించలేమని అందుకే హెల్మెట్ ధరిస్తున్నట్లు చెబుతున్నారు.
" 70 ఏళ్ల వరకు ఉన్న మహిళలు స్వీయరక్షణ కోసం ఊతకర్రను ఉపయోగిస్తున్నారు. అది జీవితంలో ఒక భాగం. వ్యాయామంలో భాగంగా కర్రను తీసుకెళుతున్నాం. అలాగే హెల్మెట్ కూడా రక్షణ ఇస్తుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరు ఢీ కొడతారో తెలియదు కదా."
- ఇందు మిశ్రా, దయాల్బాగ్ నివాసి.
రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు పెరుగుతున్న కారణంగా హెల్మెట్‌ను తప్పనిసరిగా చేసుకున్నామని మరికొందరు చెబుతున్నారు. ముఖ్యంగా సైకిల్, ద్విచక్రవాహనంపై వెళుతున్న వారు తప్పనిసరిగా ధరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు శిరస్త్రాణం ధరించటాన్ని ప్రేరణగా తీసుకుని సమీప ప్రాంతాల వారూ హెల్మెట్ వాడుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
" మా యజమాని ఆదేశాలు మేము అనుసరిస్తాం. భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మా యజమాని చెప్పారు. ఈ కారణంగానే హెల్మెట్ ధరించి కారులో ప్రయాణిస్తున్నాం."
- మీనాక్షి, భాస్కర్, దయాల్బాగ్ నివాసి
ఇదీ చూడండి: ట్రంప్ తాజ్‌మహల్ పర్యటనకు కోతుల బెడద