హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు (Heavy Rains in Hyderabad) కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి (Ghmc Mayor Vijaya Lakshmi on Rains) విజ్ఞప్తి చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన వరద నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఏమైనా ఇబ్బందులు వస్తే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ నంబర్ 040- 21111111(Ghmc Call Center Number)కు ఫిర్యాదు చేయాలని నగరవాసులకు మేయర్ సూచించారు. కంట్రోల్ రూంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని... అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
భాగ్యనగరంలో వర్షం...
హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావ కారణంగా నగరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎల్‌బీనగర్, చింతలకుంట, దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. వనస్థలిపురం, కిస్మత్‌పూర్, అత్తాపూర్, రాజేంద్రనగర్, గండిపేట, బండ్లగూడ, శంషాబాద్, లంగర్ హౌస్, గోల్కొండ, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడ్డాయి. నగరంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.
అప్రమత్తమైన యంత్రాంగం...
రేపు, ఎల్లుండి కూడా జంట నగరాల్లో పలు ప్రదేశాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains in Hyderabad) పడే సూచనలు ఉన్న దృష్ట్యా... జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని సిబ్బందిని మోహరించింది. ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని... ఆయా ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరో రెండు రోజులు వర్షాలు
పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి సమాంతరంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రెండురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ప్రకటించింది.
ఇదీ చూడండి: Rains in hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం