గ్రామాల్లోని రహదారులకు మంచిరోజుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన 736 ప్రాంతాలకు చెందిన 6,525 కిలోమీటర్ల మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం రహదారులు, భవనాల శాఖకు బదలాయించింది. అవన్నీ బీటీ రహదారులైనప్పటికీ బాగా దెబ్బతిన్నట్లు ఆ శాఖ గుర్తించింది. బదలాయింపు జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఆర్ అండ్ బి వాటిపై దృష్టి పెట్టలేదు. దశలవారీగా ఆ మార్గాలను పకడ్బందీగా రూపొందించాలని ఆలోచిస్తోంది.
అంచనాలు...
6,525 కిలోమీటర్ల మార్గాలను మెరుగుపరచడానికి రూ. 4,000 కోట్లు అవసరమవుతుందని అంచనా వేస్తోంది. వచ్చే బడ్జెట్‌లో కేటాయింపులను బట్టి ఎన్ని కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేయాలన్న దానిపై అధికారులు అంచనాలు రూపొందించనున్నారు. పంచాయతీల నుంచి బదలాయించిన వాటితో కలుపుకుని రాష్ట్ర రహదారులు 28,087 కిలోమీటర్లకు చేరాయి. రాష్ట్రం ఏర్పడ్డాక సుమారు 7,180 కిలోమీటర్ల మేరకు సింగిల్ రోడ్లను రెండు వరసలకు విస్తరించారు. 360 కిలోమీటర్ల మేరకు నాలుగు వరుసల మార్గాలను ఆరు వరుసలకు విస్తరించారు.
రూ. 10వేల కోట్లు...
ఇప్పటివరకు ప్రభుత్వం రహదారుల విస్తరణకు సుమారు రూ. 10,000 కోట్ల వరకు వెచ్చించిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పంచాయతీ శాఖ నుంచి వచ్చిన రహదారులపై దృష్టి సారించాలని అధికారులు యోచిస్తున్నారు. గత రెండేళ్ల బడ్జెట్లలో కేటాయించిన నిధులు అంతక్రితం చేపట్టిన పనులకు సర్దుబాటు చేశారు. ఇప్పటికే ఆర్ అండ్ బీ బ్యాంకుల నుంచి కూడా పెద్ద మొత్తంలో నిధులను సమీకరించింది. వచ్చే బడ్జెట్‌లోనైనా ఈ శాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.
ఇదీ చూడండి: తెలంగాణలో రాబందులు అంతరించినట్టేనా?