గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో (యూహెచ్‌సీ), నగర శివారు జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో ఉంటే కరోనా బాధితులకు ఈ కేంద్రాల ద్వారానే 70 శాతం మందికి ప్రాథమిక వైద్యం అందే అవకాశం ఉండేది.
కానీ దాదాపు అన్ని యూహెచ్‌సీల్లో అన్ని రకాల సిబ్బంది తక్కువగానే ఉన్నారు. కనీసం కరోనా బాధితులకు వైద్య సలహాలు ఇచ్చేందుకు సరిపడ సిబ్బంది లేరు. పైగా వీటి ద్వారానే ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేయాలి.
సిబ్బంది కొరత వల్ల ఈ బాధ్యతల నుంచి యూహెచ్‌సీలు, పీహెచ్‌సీలు తప్పుకొన్నాయి. ఆ బాధ్యత జీహెచ్‌ఎంసీ బిల్ కలెక్టర్లకు అప్పగించారు. అదే ఆశా కార్యకర్తలు కిట్లు అందిస్తే, మందులు ఎలా వాడాలి.. కరోనాను జయించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని విడమర్చి చెప్పేవారు.
సిబ్బంది కొరత వల్ల వేలాది మంది రోగులకు ఈ సలహాలు, సూచనలు సకాలంలో అందడంలేదు. దీంతో బాధితులు హైరానా పడిపోతున్నారు. నగరంలో కొన్ని చోట్ల బస్తీ దవాఖానాల సిబ్బంది సేవలు అందిస్తుండడమే కాస్తలోకాస్త ఊరట.
ఉన్నవారిపై అదనపు భారం!
ప్రస్తుతం యూహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది రాత్రిపగలూ తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఉదయమే కరోనా పరీక్షలు మొదలైతే రాత్రి తొమ్మిది గంటల వరకూ విధుల్లోనే ఉంటున్నారు. రోజూ వందలమందికి పరీక్షలు చేస్తున్నారు. ఫలితాలు వీరే చెప్పాలి. పైగా కొందరు కరోనా బారిన పడ్డారు. దీంతో మిగిలిన వారిపై ఆ పనిభారమూ పడింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి
- ప్రతి 25 వేల మంది జనాభాకు ఒక పీహెచ్‌సీ ఉండాలి.
- రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 75 వేల మందికి ఒక పీహెచ్‌సీ ఉంది.
- గ్రేటర్ పరిధిలో రెండు లక్షల మందికి ఒక యూహెచ్‌సీ ఉంది.
రంగారెడ్డి జిల్లాలో..
- మొత్తం పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు: 42
- ఏరియా ఆసుపత్రులు: 2
- ఉన్న వైద్యులు: 35 మంది
- భర్తీ చేయాల్సినవి: 32 స్టాఫ్‌నర్సులు, 25 ఏఎన్‌ఎంలు, 6 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
మేడ్చల్ జిల్లాలో
- మొత్తం పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు: 14
- ఏరియా ఆసుపత్రి: ఒకటి
- భర్తీ చేయాల్సినవి: 12 ఏఎన్‌ఎంలు, 22 స్టాఫ్ నర్సుల పోస్టులు.
ఇదీ చదవండిః కొవిడ్ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే