ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం.. దీనికితోడు కోతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 6-9 గంటల మధ్యలోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రామాల్లో కొన్ని రోజులుగా రాత్రివేళల్లో 3-4 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. శనివారం గృహ వినియోగదారులకు 4.60 మిలియన్ యూనిట్లు (ఎంయూలు), రైతులకు 0.04 ఎంయూలను డిస్కంలు కోత పెట్టాయి. సాంకేతిక కారణాలతో కృష్ణపట్నంలోని రెండు యూనిట్ల నుంచి 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం సమస్య తీవ్రతను పెంచింది. రాత్రి వేళల్లో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి పల్లెవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఫ్యాన్లు తిరగవు.. బయటకు వెళ్లినా ఉక్కపోత తప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉత్పత్తి, కేంద్ర సంస్థలతో పీపీఏల ప్రకారం వచ్చే విద్యుత్ పోను డిమాండు సర్దుబాటుకు రోజుకు 45-50 ఎంయూల విద్యుత్‌ను డిస్కంలు బహిరంగ మార్కెట్ నుంచి కొంటున్నాయి.
20% విద్యుత్‌కు ఎక్స్ఛేంజీలే ఆధారం
తుపాను ప్రభావంతో గత నెలలో వినియోగం తగ్గడంతో ఏప్రిల్ 8 నుంచి పరిశ్రమలకు విధించిన విద్యుత్ విరామాన్ని (పవర్ హాలిడే) డిస్కంలు తొలగించాయి. కష్టాలు తగ్గాయని అనుకుంటుండగా.. ఇంతలోనే మళ్లీ మొదలయ్యాయి. పరిశ్రమలతో కలిపి విద్యుత్ వినియోగం 190-200 ఎంయూల మధ్య ఉంటుందని అధికారులు అంచనా వేయగా... 225 ఎంయూలకు తగ్గట్లేదు. గత ఏడాది ఇదే సమయానికి ఉన్న వినియోగంతో పోలిస్తే ఇది 28.2% అధికం. రాష్ట్ర అవసరాల సర్దుబాటుకు రోజుకు 45-50 ఎంయూలను విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి డిస్కంలు కొంటున్నాయి. మొత్తం వినియోగంలో ఇది 20-22%. శనివారం ఒక్క రోజే రూ.37.90 కోట్లతో 47.72 ఎంయూలను కొన్నాయి. అయినా పీక్ డిమాండు సమయంలో, అర్ధరాత్రి గ్రిడ్ భద్రత కోసం గ్రామాల్లో రాత్రిళ్లు 3-4 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. అప్పటికీ గ్రిడ్ డిమాండు సర్దుబాటు కాకుంటే చిన్న పట్టణాలు, మున్సిపాలిటీల్లోనూ కోతలు విధించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు.
థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి తీరు
థర్మల్ ప్లాంట్ల నుంచి వచ్చే బూడిదను కుంటలోకి మళ్లించడానికి ఉపయోగించే ఎలక్ట్రోస్టాటిక్ హాపర్స్ కూలిపోవడంతో కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 1,600 మెగావాట్ల ఉత్పత్తి నిలిచింది. దీంతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి రోజుకు సుమారు 90-100 ఎంయూలకుగాను 66.7 ఎంయూలే వస్తోంది.
బొగ్గు నిల్వలున్నా.. కోతల బాధలే
జెన్‌కో థర్మల్ యూనిట్ల దగ్గర బొగ్గు నిల్వల పరిస్థితి గతంతో పోలిస్తే కొంత మెరుగైంది. ప్రస్తుతం వీటీపీఎస్‌లో (1.51 లక్షల టన్నులు) 5 రోజులు, ఆర్‌టీపీపీలో (41,615 టన్నులు) రెండు రోజులకు సరిపడా నిల్వలున్నాయి. కృష్ణపట్నం ప్లాంటును ఉత్పత్తిలోకి తేవడానికి మరో నాలుగైదు రోజులు పడుతుందని అధికారులు పేర్కొన్నారు. హిందుజా ప్లాంటు దగ్గర 18,549 టన్నుల బొగ్గు నిల్వలున్నాయి.
బొగ్గు కొరత అధిగమించే చర్యలు చేపట్టండి: పెద్దిరెడ్డి
బొగ్గు కొరత కారణంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులతో ఆయన ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వచ్చే జులై-ఆగస్టు మధ్య దేశంలో మరోసారి కొరత తీవ్రంగా ఉంటుందనే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఇప్పటి నుంచే సంస్థలు అప్రమత్తం కావాలి. వర్షాలు ప్రారంభం కావడానికి ముందే బొగ్గు నిల్వలు పెంచుకోకుంటే దేశంలో మరోసారి విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ఒక జాతీయస్థాయి పరిశోధన సంస్థ వెల్లడించింది. డిమాండు పెరిగినా దాన్ని అందుకునే స్థితిలో థర్మల్ కేంద్రాలు లేవు. గత ఏడాది 1,500 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసే సామర్థ్యం ఉన్నా.. 777 మిలియన్ టన్నులే ఉత్పత్తి అయ్యింది. మరో రెండేళ్ల వరకు బొగ్గు సరఫరా మెరుగయ్యే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యుత్ సంస్థలు 31 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలు ప్రక్రియను చేపట్టాయి. రాష్ట్రానికి బొగ్గు సరఫరా చేసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్(సీఐఎల్) చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది’ అన్నారు.
ఇవీ చూడండి..