ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని గోళ్ల, నార్పల మండలంలోని దుగుమర్రి, పెద్దవడుగూరు మండలం మజరా కొండూరులో పింఛన్లు రాకపోవడంతో పింఛనుదారులతోపాటు తెదేపా నాయకులు సోమవారం ప్రభుత్వ కార్యాలయాలవద్ద నిరసన తెలిపారు. కల్యాణదుర్గం మండలంలోని గోళ్ల పంచాయతీ పరిధిలో ప్రతి నెలా 424 మందికి పింఛను ఇచ్చేవారని, ఈ నెల మాత్రం 190 మందికే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో తెదేపా నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించారు. ఎస్‌ఐ సుధాకర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని సర్ది చెప్పారు. ఈ విషయమై ఎంపీడీవో కొండన్నను వివరణ కోరగా.. విచారణ చేపట్టి అర్హులందరికీ పింఛన్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నార్పల మండల పరిధిలోని దుగుమర్రి గ్రామంలో 14 మందికి, పెద్దవడుగూరు మండలంలోని కొండూరులో ఇద్దరికి పింఛన్లు ఇవ్వకపోవడంతో పింఛనుదారులు ఆందోళనకు దిగారు.