Janasena chief Pawan Kalyan in ippatam: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా ఇప్పటం పర్యటన తీవ్ర ఉద్రిక్తత, ఉత్కంఠ మధ్య సాగింది. జనసేన ఆవిర్భావ సభకు స్థలాలు ఇచ్చిన ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో 53 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపేందుకు, బాధితులకు అండగా నిలిచేందుకు పవన్ గ్రామంలో పర్యటించారు. పవన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడం ఉద్రిక్తతకు కారణమైంది. ఉదయం తొమ్మిదిన్నరకు పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి బాధితులను పరామర్శించేందుకు బయలుదేరారు.
ఆసమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు, పవన్ వాహనశ్రేణికి తమ వాహనాలు అడ్డంగా ఉంచారు. డీఎస్పీ సుబ్బారాయుడు ఇప్పటం వెళ్లేందుకు అనుమతిలేదని చెప్పారు. దీంతో వాహనం దిగిన పవన్.. కాలినడకన ఇప్పటం బయలుదేరారు. సర్వీసు రోడ్డు నుంచి జాతీయరహదారిపైకి వచ్చి, పాదయాత్ర మొదలుపెట్టారు. ఇప్పటం వెళ్లి తీరతానని...కావాలంటే అరెస్టు చేసుకోవాలని పోలీసులకు పవన్ స్పష్టం చేశారు. దాదాపు కిలోమీటర్ మేర పవన్ కాలినడకన వెళ్లారు. ఆయన వెనుక జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
చేసేది లేక పోలీసులు పక్కకు తప్పుకున్నారు. తర్వాత వాహనంపైకి ఎక్కి టాప్ పైన కూర్చున్న పవన్ ఇప్పటం బయలుదేరారు. పవన్ వాహన శ్రేణి ఇప్పటానికి సమీపించగానే రైల్వే గేటు వేశారు. వాహనం దిగి పవన్ పొలాల్లోకివెళ్లారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో, రైల్వే గేటు తెరిచారు. వెంటనే పవన్ వాహనంలోకి ఎక్కి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఇళ్ల కూల్చివేసిన ప్రాంతాలను చూసి పవన్ చలించిపోయారు. రోడ్డుకు మధ్యలో ఉన్న వైఎస్ విగ్రహం అలాగే ఉంచి లోపల ఉన్న ఇళ్లను కూల్చివేశారని బాధితులు పవన్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు.
వృద్ధులు, గర్భిణులు, చిన్నా పెద్దా ఎవరు అడ్డుకున్నా వినకుండా కూల్చి వేశారని వాపోయారు. కూల్చివేసిన శిథిలాలపైనే కూర్చున్న పవన్ కల్యాణ్ బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్దా ఆగిన పవన్.. బాధితులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. కొందరు తమ ఇళ్లపై నుంచి పూలు చల్లి ఆయనపై అభిమానం చాటుకున్నారు. నిన్నంతా ఆందోళనతో గడిపిన స్థానికులు పవన్ రాకతో తమకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు వివరించారు. ప్రభుత్వ వేధింపులకు జడిసేది లేదని పవన్ తెలిపారు.
రాష్ట్రానికి సజ్జల రామకృష్ణారెడ్డి డీ ఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనపై రెక్కీ జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సుపారీలు, పాన్ పరాగ్ గాళ్లకు భయపడనని తేల్చి చెప్పారు. గంటకు పైగా ఇప్పటంలో గడిపిన పవన్ అక్కడి నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వైకాపా నేతలు, రాష్ట్ర ప్రభుత్వంపై పవన్ క ల్యాణ్ నిప్పులు చెరిగారు. సమావేశం తర్వాత పవన్ విజయవాడ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లారు.
ఇవీ చదవండి: