కౌలు రైతులను ఆదుకునేవారు లేకుండా పోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కౌలు రైతుల సమస్యలను వైకాపా ప్రభుత్వం గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ఏలూరు జిల్లా చింతలపూడిలో నిర్వహించిన జనసేన సభలో పాల్గొన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్లో 3 వేలకు పైగా కౌలురైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల బాధిత కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థక సాయం చేసారు. కౌలు రైతులు అధిక వడ్డీకి అప్పు తీసుకుంటున్నారని..,అప్పు తీర్చలేక వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పవన్ వాపోయారు. రైతుల కన్నీరు తుడుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి..వారిని పట్టించుకోవటం లేదన్నారు. రైతు సమస్యలు పరిష్కరించలేని గ్రామసచివాలయాలు ఎందుకు ? అని ప్రశ్నించారు. రైతుల కష్టాలపై మాట్లాడితే వ్యంగ్యంగా విమర్శిస్తారా ? ప్రభుత్వాన్ని నిలదీశారు. సీబీఐ దత్తపుత్రుడి మాటలను తాను పట్టించుకోనని.., నర్సాపురం ఎంపీ (రఘురామ కృష్ణరాజు) చెప్పిన సూచనలు పాటిస్తానని తెలిపారు.
"ఇంకోసారి దత్తపుత్రుడు అంటే సీబీఐకి దత్తపుత్రుడు అనే మాటను ఫిక్స్ అవుతాం. కష్టాల్లో ఉన్నవారంతా నా సొంతవాళ్లే.. నేనేవరికి దత్తతగా వెళ్లను. అనంతపురం సభ తర్వాత నర్సాపురం ఎంపీ (రఘురామ కృష్ణరాజు) నాకు కొన్ని సూచనలు చేశారు. మీరు సరిగ్గా కొన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని అన్నారు. సరిదిద్దుకోవాలని చెప్పారు. వారి సూచన మేరకు నేను సరిదిద్దకుంటాను. పోయినసారి చర్లపల్లి షటిల్ టీం అని అన్నాను. అది చర్లపల్లి కాదు.. చంచల్‌గూడ షటిల్ టీం అని చెప్పారు. చంచల్‌గూడలో షటిల్ ఆడుతూ మీరు నాకు చెబుతున్నారా ? కష్టాల్లో ఉన్నవారంతా నా సొంతవాళ్లే.. నేనేవరికి దత్తతగా వెళ్లను. నన్ను దత్తత తీసుకుంటే ఎవరూ భరించలేరు."- పవన్, జనసేన అధినేత
జనసేన కార్యకర్తలపై గూండాలతో దాడులు చేయిస్తున్నారని వైకాపా ప్రభుత్వంపై పవన్ మండిపడ్డారు. తమ వారిపై దాడులు చేసే వైకాపా నేతలకు మర్యాద దక్కదని హెచ్చరించారు. పచ్చని గోదావరి జిల్లాల్లోనూ రైతు ఆత్మహత్యలు దారుణమని పవన్ వాపోయారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చిన రూ.6 వేలు కాకుండా రూ.13,500 ఇవ్వాలన్నారు. సేంద్రియ సాగు విస్తీర్ణం మరింత పెంచాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై రాయితీ తీసేశారని ఆక్షేపించారు. ముడిసరకు రావడం లేదని కృష్ణా జ్యూట్‌మిల్ మూసేశారని..,జ్యూట్‌మిల్ కార్మికులకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు.
"కౌలురైతుల సమస్యలను జనసేన గుర్తిస్తుంది. ప్రతి కౌలురైతు కుటుంబానికి పరిహారం అందేలా చూస్తాం. యువత బాధ్యత తీసుకోకుంటే సమాజంలో మార్పు రాదు. పరిశ్రమలు వస్తేనే కదా యువతకు ఉద్యోగాలు వచ్చేది. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడం ఏంటి ?. ఎన్నికల్లో రెండుచోట్లా ఓడిపోయినా మీ కోసం నిలబడ్డా."- పవన్, జనసేన అధినేత
ఇవీ చూడండి: