రాష్ట్రంలో దాదాపు 70 శాతం గ్రామాల్లోని ఇళ్లు గ్రామకంఠం స్థలాల్లో నిర్మించినవే. రెవెన్యూ రికార్డుల్లోనూ వీటిని గ్రామకంఠం స్థలాలుగా నమోదు చేసి ఉన్నారు. తాజాగా నిర్వహిస్తున్న ఆస్తుల నమోదు ప్రక్రియలోనూ భూమి స్వభావాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. దాదాపు 70 ఏళ్ల క్రితం కేటాయించిన ఈ భూముల్లో తాజా ప్రక్రియతో నిర్మాణదారులకు ఆ నివాసాలకు సంబంధించిన పాసుపుస్తకాలు దక్కనున్నాయి. భూములపైనా పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు దక్కాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఎక్కువగా సాదాబైనామాలే
గ్రామాల్లో ఆస్తుల క్రయవిక్రయాలు ఎక్కువగా సాదాబైనామాల కిందనే జరిగాయి. తాజా ఆస్తుల నమోదులో ఇలాంటివన్నీ తెరపైకి వస్తున్నాయి. గతంలో ఒక దఫా సాదాబైనామా అవకాశం ఇవ్వడంతో చాలా మంది అనుమతి తీసుకుని పంచాయతీ ద్వారా మ్యూటేషన్లు పొందారు. మరోమారు అవకాశం ఇస్తే గ్రామకంఠంలో భూమి కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నవారికి పూర్తి హక్కులు దక్కనున్నాయి. గ్రామకంఠంలో గతంలో భూములను పొందిన వారిలో చాలా మంది ప్రస్తుతం జీవించి లేరు. వారి స్థానంలో వారసుల పేర్లను పంచాయతీ రిజిస్టర్లలో మార్పు చేసి ఉండకపోతే ఇప్పుడు కొంత సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వాటి భూయజమాని లేదా అతని భార్య ఉంటే వారికి హక్కులు వర్తిస్తాయి. వారి కుటుంబసభ్యులకు హక్కులు దక్కాలంటే స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సిబ్బంది సూచిస్తున్నారు.
తర్వాతే గృహాల నిర్మాణాలకు అనుమతి
గ్రామకంఠాన్ని దాటి సాగుభూముల్లోనూ నివాస గృహాలు ఏర్పడ్డాయి. ప్రస్తుత నమోదు ప్రక్రియ ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించిన ఈ సర్వే నంబర్లలోని గృహాలకు హక్కులు కల్పించే అవకాశాలు లేవు. వీటిలోని ఇళ్లకు పట్టణ ప్రణాళికా విభాగం- డీటీసీపీ, వ్యవసాయేతర రంగానికి భూ వినియోగం- నాలా అనుమతులు పొందాల్సి ఉంటుంది. తర్వాతే గృహాల నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. ఇవేమీ లేకుండా ఇళ్లు కట్టుకున్నవారు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నారు. ఈ గృహాల సమాచారాన్ని మాత్రం నమోదు చేస్తున్నారు.
హక్కులు పొందడం కష్టం
వంద రూపాయలు తదితర బాండ్ పేపర్లపై ఒప్పందంతో భూములు కొనుగోలు చేసుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారూ పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నారు. సాదాబైనామా తీరులోనే నోటరీ ఒప్పందాలపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి స్థలాల్లో నిర్మించే నివాసాలకు అనుమతులు జారీచేస్తే తప్ప హక్కులు పొందడం కష్టమని సిబ్బంది చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి'