Padma Awards 2023: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కీరవాణి స్వస్థలం. 1990లో ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ‘మనసు మమత’ సినిమాకు ఆయన మొదటిసారి సంగీత దర్శకుడిగా పనిచేశారు.దాదాపు 250 సినిమాలకి స్వరాలు సమకూర్చారు.
అన్నమయ్య సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎనిమిదిసార్లు, నేపథ్య గాయకుడిగా మూడుసార్లు నంది పురస్కారాల్ని అందుకున్నారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కీరవాణి పేరు మార్మోగిపోతుంది. ఆ చిత్రంలో నాటు నాటు పాటకిగానూ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్‌ని అందుకున్నారు. ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్‌ని కూడా దక్కించుకుని చరిత్రని సృష్టించింది.
న్యూక్లియర్ ఫిజిక్స్: ఇక రాష్ట్రం నుంచి సత్యసాయి విశ్వవిద్యాలయ ఆచార్యులు ప్రకాష్‌చంద్రసూద్‌ను పద్మశ్రీ వరించింది. సత్యసాయిబాబా సూచనతో 1998 నుంచి సత్యసాయి విశ్వవిద్యాలయంలో విద్యాబోధనతోపాటు పరిశోధన అధ్యాపకులుగా పనిచేస్తున్న ఆయన ప్రత్యేకంగా న్యూక్లియర్ ఫిజిక్స్ ఎడ్యుకేషన్ రంగంలో ముందుకెళ్తున్నారు.దేశంలోని అత్యంత సీనియర్ అణుశాస్త్రవేత్తల్లో ఆయనా ఒకరు.
సైన్స్ అండ్ ఇంజినీరింగ్: ఇక డాక్టర్ అబ్బారెడ్డి నాగేశ్వరరావుకు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆర్కిడ్ జాతికి చెందిన 35 రకాల మొక్కలను కనుగొన్న ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు సేవలందించారు. ఈయన పరిశోధనలకు గుర్తింపుగా రెండు ఆర్కిడ్ జాతి మొక్కలకు ఆయన పేరు పెట్టారు. ప్రముఖ హరికథకుడు కోట సచ్చిదానందశాస్త్రికీ పద్మశ్రీ పురస్కారం లభించింది. రామాయణ, మహాభారత ఇతిహాసాలు, అష్టాదశ పురాణాల్లోని ఆసక్తికర అంశాలను హరికథా రూపంలోకి తెచ్చి జనాకర్షకంగా చెప్పిన ఘనత సచ్చిదానందశాస్త్రిది.
లక్కబొమ్మల తయారీ: ఇక లక్కబొమ్మల తయారీలో పేరొందిన చింతలపాటి వెంకటపతిరాజు కళనూ కేంద్రం గుర్తించి పద్మశ్రీ ప్రకటించింది. ఏటికొప్పాకలో పేరున్న హస్తకళాకారులు కళకు ఆదరణ లేక కూలి పనులకు వలసవెళ్లడాన్ని చూసి హస్తకళా నిలయాన్ని ఏర్పాటుచేశారు. కళాకారులకు ఆధునిక బొమ్మల తయారీపై వెంకటపతిరాజు శిక్షణ ఇచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన బి.రామకృష్ణారెడ్డి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గానూ పనిచేయడంతోపాటు గిరిజన భాషలైన కువి, మండలపై విస్తృత పరిశోధనలు చేశారు. దానికి ఆయన్ను పద్మశ్రీ వరించింది.
చేపల ఉత్పత్తి: దేశంలో నీలి విప్లవం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించి చేపల ఉత్పత్తి పెరగడంలో విశేష కృషి చేసిన మత్స్యశాస్త్రవేత్త మోదడుగు విజయగుప్తానూ కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. బాపట్లలోకు చెందిన విజయగుప్తా కేంద్రం, ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వంలో మత్స్యశాఖల సాంకేతిక సలహాదారుగా పనిచేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్. ఫౌండేషన్ ద్వారా చేస్తన్న సేవలను కేంద్రం గౌరవించింది. విమాన ప్రమాదంలో భార్య పిల్లల మరణంతో కెనడాలో 22 ఏళ్ల ప్రస్థానాన్ని వదిలి స్వదేశానికి తిరిగొచ్చిన చంద్రశేఖర్ విద్యాభివృద్ధికి సంకురాత్రి ఫౌండేషన్ స్థాపించారు. 1992లో 25మందితో మొదలైన సాయంత్రం పాఠశాల ఇప్పుడు శారదా విద్యాలయంగా ఎందరికో విద్య అందిస్తోంది.
వైద్యం: హైదరాబాద్ పాతనగరంలో జన్మించిన పిల్లల వైద్యుడు పసుపులేటి హన్మంతరావుకూ ఏపీ నుంచే పద్మశ్రీ ప్రకటించారు. పిల్లల వైద్యుని నుంచి క్రమేపీ మానసిక వైకల్యం గల పిల్లల సేవలకు స్వీకార్ మల్టిస్పెషాలిటీ రిహాబిలిటేషన్ సెంటర్‌ను స్థాపించారు. దివ్యాంగ పిల్లలకు వైద్యం చేస్తూ 35కి పైగా జాతీయ, రాష్ట్ర, అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. తిరుపతి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్- ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్.గణేష్‌కు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మశ్రీ పురస్కారం వరించింది.1981లో హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో చేరారు. అక్కడ దేశంలోనే తొలి డీఎన్‌ఏ సంశ్లేషణ (సింథసిస్) సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. 2006లో పుణెలో ఏర్పాటుచేసిన ఐసర్‌కు తొలి డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
చిరు ధాన్యాలు: చిరు ధాన్యాల ఉపయోగాలు, వాటి వినియోగం గురించి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డాక్టర్ ఖాదర్ వలీనీ పద్మశ్రీ పురస్కారం వరించింది. వైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఆయన అంతరించిపోతున్న కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదల పునరుద్ధరణకు కృషి చేశారు.
ఇవీ చదవండి: రాష్ట్రం నుంచి ఐదుగురికి 'పద్మ' పురస్కారాలు.. ఇదే వారి నేపథ్యం
ORS పితామహుడికి పద్మవిభూషణ్.. ములాయం సింగ్, జాకీర్ హుస్సేన్ సహా ఆరుగురికి