హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న యునాని, సరోజినీదేవి, కింగ్ కోటి ఆస్పత్రులను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సందర్శించారు. కొవిడ్ పరీక్షలు, సౌకర్యాలు, ఏర్పాట్లను తెలుసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఫోన్లో మాట్లాడిన అసద్... ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని కోరారు.
నిరీక్షించాల్సి వస్తోంది
ప్రతి కేంద్రంలోనూ రోజుకు వెయ్యి మందికి పరీక్షలు చేసేలా చూడాలని కోరారు. పరీక్షల కోసం చాలా మంది ఉదయం నుంచి నిరీక్షించాల్సి వస్తోందన్న ఆయన.. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేయడం మంచిదేనని చెప్పారు. ప్రస్తుతం వ్యాధి నిర్ధరణ పరీక్షలు కేవలం రోగుల ప్రాథమిక కాంటాక్టులకు మాత్రమే చేస్తున్నారని.. వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు చేయాలని అసదుద్దీన్ కోరారు.
త్వరగా పరీక్షలు చేయించుకోండి!
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణీలు వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. చార్మినార్ యునాని ఆసుపత్రిని కొవిడ్ రెఫరల్ ఆసుపత్రిగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటలను కోరారు. తద్వారా రోగులకు వైద్య సహాయం అందడంతోపాటు మిగతా ఆసుపత్రులపై భారం తగ్గుతుందని వివరించారు.
ఇదీ చూడండి : నిమ్స్‌లో వైద్య సిబ్బంది ఆందోళన... నిలిచిన ఓపీ సేవలు