Panchayat secretary protest : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 317జీవో వల్ల ఔట్ సోర్సింగ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రోడ్డున పడ్డారు. తొలగించిన 400మందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కల్పన కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 317 జీవో, జోనల్ బదిలీలో భాగంగా గ్రేడ్ 1,2,3,4 పంచాయతి కార్యదర్శులు బదిలీ అయి... వివిధ జిల్లాల్లో పోస్టింగ్ తీసుకోవడమే శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 400మంది కార్యదర్శుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు.
న్యాయం చేయండి..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 మంది కార్యదర్శులు పని చేస్తున్నారని... ఇప్పటికే నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నిర్మల్ మరియు సంగారెడ్డి జిల్లాల్లో సీనియర్లను నియమించడంతో... తమ బతుకులు ఆగం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని పెళ్లి జరిగిందని... మరికొందరకి ఖాయం అయిందని... ఉద్యోగం పోతే ఆ పెళ్లి కాస్తా పెటాకులయ్యే అవకాశం ఉందన్నారు. 2018లో రాసిన జూనియర్ పంచాయతి కార్యదర్శుల రాత పరీక్షలో ఉన్న మెరిట్ లిస్ట్ ఆధారంగా తమను ఉద్యోగంలో నియమించడం జరిగిందని... తమలో కొందరిని ఇప్పటికే జూనియర్ పంచాయతి కార్యదర్శులుగా మార్చడంతో... ఆశలు పెట్టుకుని మరే ఉద్యోగానికి ప్రయత్నించకుండా ఉన్నామని గోడు వెల్లబోసుకున్నారు.
మెరిట్ లిస్టు వారీగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 800 మందిని తీసుకుంది. జీవో నంబర్ 317, జోనల్ బదిలీలు కొన్ని జిల్లాల్లో మాత్రమే జరిగాయి. ముఖ్యంగా హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి ఇలా కొన్ని జిల్లాల్లో మాత్రమే టర్మినేషన్ జరిగిది. మిగతా జిల్లాల్లో ఎలాంటి ఎఫెక్ట్ లేదు. మా హార్డ్ వర్క్‌ను ప్రభుత్వం గుర్తించాలి. మమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం. మాకు సరైన న్యాయం చేయాలి.
-అనసూరియ, తొలిగించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి
జోనల్ బదిలీ ప్రక్రియ సర్దుబాటు పూర్తి కాగానే... తమను విధుల్లోకి తీసుకోవాలని ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు వేడుకుంటున్నారు. లేదంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. ప్రభుత్వమే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పంచాయతీ కార్యదర్శిలుగా మమ్మల్ని తీసుకున్నారు. బదిలీల ప్రక్రియలో భాగంగా టర్మినేట్ చేశారు. మాకు అన్యాయం చేయవద్దు. మమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. అక్కడ ఖాళీలు లేకపోతే జిల్లాలో ఖాళీ ఉన్న ప్రాంతాల్లో పనిచేయడానికైనా సిద్ధంగానే ఉన్నాం.
-తొలగించిన పంచాయతీ కార్యదర్శులు
ఇదీ చదవండి: రాష్ట్ర కేబినెట్ భేటీ.. రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశం!