Key Changes in Telangana BJP : ఎన్నికల ముంగిట పార్టీలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడమే లక్ష్యంగా సంస్థాగతంగా మార్పులు చేసిన బీజేపీ.. మరిన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అందరికి సముచిత ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలకు మరికొన్ని కీలక పదవులు దక్కుతాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన నేపథ్యంలో రాష్ట్రం నుంచి మరొకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్‌లు లోక్‌సభ సభ్యులుగా కొనసాగుతుండగా.. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్‌లు ఉన్నారు. వీరిలో కేంద్రమంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి మొదలైంది.
Organizational Changes in Telangana BJP : బీజేపీ శాసనసభాపక్ష నేతతో పాటు.. జీహెచ్ఎంసీ, కరీంనగర్ కార్పొరేషన్‌లో ఫ్లోర్ లీడర్ వంటి పదవులను భర్తీ చేస్తారని సమాచారం. పదవుల అంశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇటీవల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి అసంతృప్తులు, అలకలకు ముగింపు పలకడంతో పాటు.. పార్టీ శ్రేణుల్ని పూర్తిగా ఎన్నికల కార్యక్రమాల్లో నిమగ్నం చేసేలా అధిష్ఠానం కార్యాచరణను అమలు చేయనుందని తెలిసింది.
ఇందులో భాగంగానే పార్టీ ఇన్‌ఛార్జులు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్ పూర్తిస్థాయిలో.. రాష్ట్ర పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ ఎన్నికల కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని తెలిసింది. కిషన్‌రెడ్డికి క్షేత్రస్థాయి పార్టీ వ్యవహారాలు, నాయకుల గురించి అవగాహన ఉండటంతో అసంతృప్తులను చక్కదిద్దడం పెద్ద సమస్య కాబోదని తెలంగాణ ముఖ్య నాయకులు అంచనా వేస్తున్నారు.
BJP Focus on Telangana Assembly Elections : కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం నేతల్లో నెలకొన్న నైరాశ్యాన్ని దూరం చేయడంతో పాటు.. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రజలు గుర్తించేలా చేయడంపైనే అగ్రనాయకులు ప్రధానంగా దృష్టి సారిస్తారని తెలిసింది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలు నెలలో ఒకట్రెండు సార్లు ఉంటాయని తెలిసింది.
ఈ క్రమంలోనే పార్టీ నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలపైనే దృష్టి సారించేలా బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కేంద్రమంత్రి పదవి విషయంలో కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 8న ప్రధాని పర్యటన అనంతరం భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాచరణను ఖరారు చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో కిషన్‌రెడ్డి సమావేశమై పార్టీని ఎన్నికల దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు.
ఇవీ చదవండి: