Opposition Parties on assembly sessions : శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ఆఖరి రోజు.. రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో మజ్లిస్, కాంగ్రెస్, బీజేపీ సహా.. అధికార పార్టీ నేతలు పలు అంశాలపై ప్రసంగించారు. తొమ్మిది ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎలాంటి మత ఘర్షణలు చోటు చేసుకోలేదని దేశంలోనూ ఇదే తరహాలో పాలన రావాలని.. మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆకాంక్షించారు. దేశంలో మణిపుర్, హర్యాణా, రాజస్థాన్‌లో.. చోటు చేసుకుంటున్న ఘటనలపై అక్బరుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిని... అరెస్టు చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు.
Bhatti on Double Bed Room Allocation : ఇళ్లు లేని వారిని గుర్తించి అందరికీ ఇళ్లను కేటాయించాలని.. సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వానికి సూచించారు. అసైన్డ్ చేసిన భూములను తిరిగి.. పేదల నుంచి వెనక్కి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అటవీ భూములకు పట్టాలు ఇచ్చినా ధరణిలోకి రావడం లేదన్న బాధితుల సమస్యలను.. సభ దృష్టికి భట్టి తీసుకురాగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోదాహరణంగా సమాధానం ఇచ్చారు.
విద్యారంగంపై ఈటల ఆందోళన : వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఇంజినీర్‌లతో కలిసి చెక్ డ్యాంలను పరిశీలించి.. లోపాలను సరిచేయాలన్నారు. విద్యారంగం, వైద్య రంగంలో నెలకొన్న సమస్యలపై ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై.. కాంగ్రెస్, బీజేపీ నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తప్పుబట్టారు. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఎంత భద్రంగా ఉంటుందో.. తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ దగ్గర ఉంటే అంతే భద్రంగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ బాల్క సుమన్ తెలిపారు. శాసనసభ అఖరి సమావేశాలు కావడంతో స్వల్పకాలిక చర్చలో వివిధ పార్టీల నేతలు.. తమ దృష్టికి వచ్చిన అన్ని అంశాలను సభ ముందుకు, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
"ఇళ్లు లేని వారిని గుర్తించి అందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలి. ప్రభుత్వం పంచిన అసైన్డ్ భూములను.. తిరిగి పేదల నుంచి వెనక్కి తీసుకోకూడదు. పోడు భూములకు పట్టాలు ఇచ్చినా ధరణిలో రావడం లేదు. తక్షణమే పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలి". - భట్టి విక్రమార్క, సీఎల్‌పీ నేత
"రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో.. నిరాశ్రయులైన వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలి. వరదల నివారణకు చెక్‌డ్యాంల నిర్మాణం జరగాలి. ఇంజినీర్‌లతో కలిసి చెక్ డ్యాంలను పరిశీలించి.. లోపాలను సరిచేయాలి. విద్యారంగం, వైద్య రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి". - ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే