TSPSC Paper Leakage : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కావాల్సిన వాళ్లను ప్రభుత్వం కాపాడుతూ.. చిన్న చిన్న ఉద్యోగులను ఇరికిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేపర్ లీకేజీలో అధికారిణి శంకరలక్ష్మి నుంచే నేరం మొదలైందని ఆరోపించారు. ఈ కేసులో విదేశాల నుంచి హవాలా రూపంలో డబ్బులు వచ్చాయనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్‌ను కలిసి వివరాలు అందించారు. జగిత్యాల జిల్లాలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్‌కు అందించిన వారు ఎవరని ప్రశ్నించారు. పరువు నష్టం కేసులో.. కేటీఆర్ పరువు రూ.100 కోట్లు అని ఎలా నిర్ణయించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
"ప్రశ్నించిన విద్యార్థి సంఘం నేతలపై కేసులు పెట్టడం సిగ్గుచేటు. పేపర్ లీకేజీలో అధికారిణి శంకరలక్ష్మి నుంచే నేరం మొదలైంది. శంకరలక్ష్మిని ఏ-1, ఛైర్మన్‌ను ఏ-2, సెక్రటరీని ఏ-3గా చేర్చాలి. పెద్దలను కాపాడి చిరు ఉద్యోగులను బలి చేస్తున్నారు. కేటీఆర్ సహా టీఎస్‌పీఎస్సీ అధికారులను అందరినీ ప్రశ్నించాలి. పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్‌కు ఇచ్చింది ఎవరు. సీబీఐ, ఈడీ అధికారులతో విచారణకు ఆదేశాలు ఇవ్వాలి." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
30 లక్షల మంది జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నష్టపోయిన ఒక్కో అభ్యర్థికి రూ.లక్ష పరిహారం చెల్లించడం సహా మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సంగారెడ్డిలో డిమాండ్ చేశారు.
టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించిన వైఎస్ షర్మిలతో పాటు వైఎస్‌ఆర్‌టీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి.. స్టేషన్‌కు తరలించారు. ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. తన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టి.. లుక్ అవుట్ ఆర్డర్ ఇచ్చారన్న ఆమె.. తాను ఏమైనా క్రిమినల్‌నా అంటూ ప్రశ్నించారు. పేపర్ లీకేజీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితేనే అసలు విషయాలు బయటకు వస్తాయని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
'పేపర్ లీకేజీలో చిన్న వాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారు. పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ఆందోళన అంటే హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఆందోళన కోసం నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చా. హోటల్ రూమ్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారు. నాకు లుక్ అవుట్ ఆర్డర్ నోటీస్ ఇచ్చారు. లుక్ అవుట్ ఆర్డర్ ఇవ్వడానికి నేను క్రిమినల్‌నా?''- వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
ఇవీ చూడండి..
TSPSC పేపర్ లీకేజీ కేసు.. ఆ ఏడుగురికి సిట్ నోటీసులు..!
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు.. తేదీలివే!