ఆశయాలు అందరికి ఉంటాయి.. కానీ వాటిని ఆచరణలో చూపే అవకాశం మాత్రం కొందరికే దక్కుతుంది. ఇదే కోవకు చెందిన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సతీశ్ చాలా ఏళ్ల కిందట హైదరాబాద్‌లో వచ్చి స్థిరపడ్డారు. ఇంటర్ వరకు ఇక్కడే చదివి... ఫ్యాషన్ రంగంపై ఉన్న మోజుతో ముంబయిలో కోర్సు చేశాడు. తర్వాత కెనడ వెళ్లి అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చేసి ఫ్యాషన్ డిజైనర్‌గా మారాడు. సెలెబ్రిటీలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసే అవకాశం రావడం వల్ల డబ్బులు బాగానే సంపాదించాడు.
అనారోగ్యానికి కారణమౌతున్న గ్లోబల్ వార్మింగ్
క్షణం తీరిక లేకుండా.. రెండు చేతులా సంపాదిస్తున్న సతీశ్‌ను ఒక సంఘటన పూర్తిగా మార్చేసింది. తన స్నేహితుడు మోహన్ నాయర్ రెండు కాళ్లు పనిచేయని తన కూతురిని వెంటబెట్టుకొని వచ్చాడు. చిన్న పిల్లలంటే ఎక్కువగా ఇష్టపడే సతీశ్... ఆపాపను చూసి చలించిపోయాడు. చిన్నపిల్లల సంరక్షణ కోసం హ్యాపీ కిడ్స్ హెల్తీ కిడ్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. పిల్లల అనారోగ్యానికి కారణమౌతున్న గ్లోబల్ వార్మింగ్‌పై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రజలను చైతన్యం చేయడం..
మన భూమిని మనం కాపాడుకుందాం అనే నినాదంతో గ్లోబల్ వార్మింగ్‌పై ప్రజలను చైతన్యం చేయడం ప్రారంభించాడు. దీనికోసం ఫ్యాషన్ డిజైన్ రంగాన్నీ వదులుకున్నాడు. ఆస్తులన్నీ అనాథ శరణాలయానికి రాసిచ్చాడు. 72 దేశాలు తిరిగి ఆయా దేశాల్లో ప్రధానులు, అధ్యక్షులు, ప్రముఖులు 1,200 మంది నుంచి సిల్క్ ఫాబ్రిక్ వస్త్రాలపై సంతకాలు, ఆటోగ్రాఫ్‌లు సేకరించాడు. సిల్క్ ఫాబ్రిక్ వస్త్రాలన్నింటిని కలిపి కుట్టి 2 కిలోమీటర్ల బ్యానర్ తయారుచేసి విద్యాలయాలు, పాఠశాలల్లో ప్రదర్శిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నాడు. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాడు.
యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో ఈ బ్యానర్‌ను ప్రదర్శించాడు. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నాడు. ప్రపంచానికే విఘాతంగా మారిన పర్యావరణ కలుష్యంపై తన పోరుతో యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.
ఇదీ చూడండి: అందుబాటులోకి రానున్న హైటెక్ సిటీ- రాయదుర్గం మెట్రో