వాలంటైన్స్ డే రోజున ప్రేమికులకు రక్షణ కల్పించాలని ఆల్ఇండియా దళిత, క్రైస్తవ సంఘాల సమాఖ్య ప్రతినిధులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పార్కులు, ఆలయాలు, బహిరంగ ప్రదేశాల్లో పోలీసులు.. ప్రేమికులకు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ సమాఖ్య ప్రతినిధి జెరూసలేం మత్తయ్య కమిషన్ను కోరారు.
పలు సంఘాల కార్యకర్తలు ప్రేమికులు వచ్చే పార్కులు, పబ్లిక్ ప్రదేశాలకు వచ్చి యువతీ, యువకులకు పెళ్లిళ్లు చేస్తామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఆ విషయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి, డీజీపీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మానవ హక్కుల్లో భాగమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. పరస్పరం ఒకరి అభిప్రాయం మరొకరు తెలిపే అవకాశం యువతీ, యువకులకు కల్పించాలని హెచ్ఆర్సీని కోరారు.
ఇదీ చూడండి : గడ్డిఅన్నారం మార్కెట్ యార్డు.. కోహెడకు తరలింపు