సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని జవహర్ రైల్వే కాలనీలో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధి జవహర్ రైల్వే కాలనీ సమీపంలో అల్వాల్ కు చెందిన 80 సంవత్సరాల వృద్ధురాలు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం వద్ద కుక్కలు గుమిగూడి ఉండటం మూలంగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కుక్కలు వెంబడించి..
మృతురాలిని కుక్కలు వెంబడించి చంపినట్లు స్థానికులు చెబుతున్నా.. పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించగా.. ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఎవరూ లేని వేళ బయటకు..
గత మూడు నెలల క్రితం ఇదే విధంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయిందని తెలిపారు. బుధవారం మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వృద్ధురాలు బయటకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. స్థానికులు మాత్రం ఆమె కుక్కల దాడిలో మృతి చెందినట్లుగా పోలీసులకు సమాచారం అందించారు.
కాలనీలో కుక్కల బెడద..
తమ కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. మృతురాలు కుక్కల దాడిలో చనిపోయిందా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి : 'అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం.. సిటీ బస్సులకు నో'