Sub-Registration Offices: రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో తరచూ లంచాలు తీసుకుంటూ అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి.. రిజిస్ట్రేషన్లు చేసి అందిన మేరకు దోచుకుంటున్నారు. ఆస్తి విలువను బట్టి కనీసం రూ.2 వేల నుంచి రూ.లక్షల వరకు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు అనుకూలంగా పత్రాల తయారీకయ్యే ఖర్చులతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ముట్టజెప్పాల్సిన సొమ్మును డాక్యుమెంట్ రైటర్లు తీసుకుంటున్నారు. లింకు డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోవడం, సాక్షులు అందుబాటులో లేకపోతే సర్దుబాటు చేయడం, రిజిస్ట్రేషన్ విలువ తగ్గించి చూపించేందుకు ముక్కు పిండి అదనంగా గుంజుతున్నారు.
పట్టణ, నగర ప్రాంతాల్లో ఒక్కోచోట ఒక్కో రేటు ఉంటుందని డాక్యుమెంట్ రైటర్లు కొందరు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్య ఆధారంగా రోజుకి కనీసం రూ.20 వేలు సబ్-రిజిస్ట్రార్ జేబులోకి వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వందకు పైగా రిజిస్ట్రేష్లన్లు అయ్యే కార్యాలయాల నుంచి రూ.50 వేలు అంతకుమించి మామూళ్లు వస్తాయని తెలుస్తోంది. రోజువారీగా వచ్చే మొత్తాల్లో ప్రతి ఒక్కరికీ వాటా ఉంటుంది. కొందరు డాక్యుమెంట్ రైటర్లు.. వసూళ్ల విషయంలో చెలరేగిపోతున్నారు. పత్రాల్లో ఏ లోపం దొరికినా.. రిజిస్ట్రేషన్ కాదని హెచ్చరించి అధిక మొత్తంలో లాగుతున్నారు. ఇందులో కొంతభాగమే సబ్-రిజిస్ట్రార్‌కు ఇచ్చి మిగిలింది నొక్కేస్తున్నారు.
గడిచిన మూడేళ్లలో 40 మంది సస్పెండ్..: 2019లో ప్రభుత్వ అనుమతి లేని లే అవుట్లలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసి ఏకంగా 16 మంది సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ అయ్యారు. నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సస్పెన్షన్లు జరిగాయి. ఇక గడిచిన మూడేళ్లలో దాదాపు 40 మంది సస్పెండ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. అయినా కొన్ని నెలలకే మళ్లీ పోస్టింగ్ ఇస్తుండటంతో భయం లేకుండా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల యాదగిరిగుట్ట, రాజేంద్రనగర్, ఘట్కేసర్ పరిధిలోనూ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
ముడుపులు ముట్టచెప్పి.. అనుకున్న చోటుకు బదిలీ..: సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లోనూ విపరీతమైన పోటీ నెలకొంది. ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో.. ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేయకపోయినా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వచ్చే మొత్తాలే అధికంగా ఉంటున్నాయి. ఆస్తి విలువ ఎక్కువ ఉంటే దాదాపు రూ.లక్ష గిట్టుబాటు అవుతుందనే ఆరోపణలున్నాయి. అంటే నెలకు రూ.పది లక్షలు అక్రమంగా అదనపు ఆదాయం ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసమే ముడుపులు ముట్టచెప్పి మరీ.. అనుకున్న చోటుకు బదిలీ చేయించుకుంటారు. నాలుగైదు నెలల్లోనే ఖర్చు పెట్టిన మొత్తం వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ల గత చరిత్ర ఆధారంగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పోస్టింగ్‌లు ఇచ్చినట్లయితే కొంత అవినీతి తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవీ చూడండి..